కులకచర్ల, ఏప్రిల్ 16 : గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల్లో పెట్టిన మొక్కలు ఎండిపోతుండటంతో వాటి జాడ తెలియకుండా ఉండేందుకు గ్రామపంచాయతీల సిబ్బంది వాటికి నిప్పుపెడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో వీటి నిర్వహణ ఉద్యమంగా చేశారు.
ప్రతి చెట్టుకు నీటిని అందించడంతోపాటు వాటి నిర్వహణ చాలా బాగుండేది. కాని నేటి ప్రభుత్వం వాటిపై దృష్టి సారించకపోవడంతో మొక్కలు, చెట్లు ఎండిపోతున్నాయి. రెండు రోజులకోసారి నీటిని అందించాల్సి ఉండగా.. సర్కారు నిర్వహణ నిధులు విడుదల చేయకపోవడంతో మొక్కలకు నీటిని అందించలేకపోతున్నామని గ్రామపంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదని తెలుపుతున్నారు.
కులకచర్ల మండల పరిధిలోని బోట్యానాయక్తండా గ్రామపంచాయతీ పరిధిలోని వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన మొక్కలకు నీరు అందించక ఎండిపోవడంతో వాటికి గ్రామపంచాయతీ సిబ్బంది నిప్పుపెట్టారు. దీనికి కారణం తమకు నిధులు రాకపోవడమేనని సిబ్బంది తెలియజేస్తున్నారు. దీనిపై పంచాయతీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి హరితహారం ద్వారా పల్లె ప్రకృతివనాలు, వైకుఠధామాలు, గ్రామపంచాయతీల్లో నాటిన మొక్కలకు నీటిని అందించి వాటిని సంరక్షించాలని కోరుతున్నారు.