రంగారెడ్డి, ఆగస్టు 10 (నమస్తేతెలంగాణ) : నగరశివార్లలో విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో రేషన్‌కార్డుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బులు, పైరవీలు ఉంటేనే దరఖాస్తులు ముందుకెళుతున్నాయని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రంగారెడ్డిజిల్లాలో నివాసముంటున్న అనేకమంది పేదప్రజలు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్‌కార్డులు తీసుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులం అవుతామని భావించి ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తుల పరిశీలనతో పాటు రేషన్‌కార్డుల కోసం అర్హులను గుర్తించే ప్రక్రియలో ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది కీలకంగా మారారు. ఈ నేపథ్యంలోనే పైరవీలు….పైసలున్నవారికే అధికారులు రేషన్‌కార్డుల కోసం సిఫార్సు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. దీంతో హైదరాబాద్ శివార్లలోని సరూర్‌నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, రాజేంద్రనగర్, గండిపేట్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో రేషన్‌కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.
ఈ దరఖాస్తులను పరిశీలించి రేషన్‌కార్డుల కోసం అర్హులుగా గుర్తించే ప్రక్రియలో డబ్బులు, లేదా పైరవీలు ఉన్నవారికే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రేషన్‌కార్డుల కోసం శివారు మండలాల్లోని ప్రజలు ప్రతిరోజూ పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కొత్త రేషన్‌కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరు సంబంధిత ఆర్ఐలు లేదా తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారుల వద్దకు వచ్చి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పైసలిచ్చిన వారికి లేదా పైరవీలు ఉన్నవారికే రికమండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కొత్త రేషన్‌కార్డుల కోసం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 2లక్షలకు పైగా కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు 26వేల మందికి కొత్తగా రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. మరో 42వేలకు పైగా దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా దరఖాస్తులు అధికారులు గ్రామస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా శివారు ప్రాంతాల్లోని సరూర్‌నగర్‌లో 33వేల దరఖాస్తులు, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ తదితర మండలాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.