కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాలపై గ్రామ సభల్లో ఆరు గ్యారెంటీల అమలుపై అధికారులను ప్రజలు ఎక్కడికక్కడా నిలదీస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న గ్రామ సభలు, వార్డు సభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సభల్లో ప్రజలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది.
పరిగి, జనవరి 24 : సమావేశాలు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం తప్ప సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయని పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు ప్రజలు అధికారులను నిలదీశారు. శుక్రవారం తుంకులగడ్డలో నిర్వహించిన వార్డుసభలో పలు అంశాలపై ప్రజలు అధికారులను ప్రశ్నించారు. సమావేశాలు పెట్టి మళ్లీ, మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదని వారు మండిపడ్డారు. ఏడాదిలో పలుమార్లు దరఖాస్తులు అందజేసినా ఈరోజు మళ్లీ దరఖాస్తు ఇవ్వమంటున్నారు.. ఇదేమిటని వారు ప్రశ్నించారు. తుంకులగడ్డలో అభివృద్ధి జరగడం లేదని, నీళ్లు సరిగా రావడం లేదని పలువురు మహిళలు పేర్కొన్నారు. పలు అంశాలపై వార్డు ప్రజలు నిలదీయడంతో అధికార పార్టీ నాయకులు వారిని సముదాయించారు. పరిగి పట్టణంలోని 10, 13, 14, 15 వార్డుల్లో జరిగిన వార్డు సభల్లో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కమిషనర్ వెంకటయ్య, కౌన్సిలర్లు పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. పూడూరు మండల పరిధిలోని చన్గోముల్లో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. రైతుభరోసా, ఆత్మీయ భరోసా అర్హులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులను ఎంపిక చేశారని వారు అధికారుల ముందు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులను పీఏసీఎస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, ఎస్సై మధుసూదన్‌రెడ్డి సముదాయించేందుకు ప్రయత్నించినా వారు ఆందోళన కొనసాగించారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదేం పాలన?
బంట్వారం (కోట్‌పల్లి) : ఇందిరమ్మ పాలన, పేదల పక్షమని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు పేదలను ఇబ్బందులకు గురి చేయడమే ఇందిరమ్మ పాలనా అంటూ ప్రజలు మండి పడుతున్నారు. కాంగ్రెస్ హయాంలోనే మంచి పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. నేడు నాలుగు పథకాల అమలు కోసం నిర్వహిస్తున్న గ్రామ సభలు గందరగోళంగా మారాయి. గ్రామ సభల్లో అధికారులు చెబుతున్న వాటికి.. క్షేత్రస్థాయిలో ఉన్న అర్హుల జాబితా సంఖ్యలకు పొంతన కుదరడం లేదు. ఏదో ఒకటి చెప్పి సమావేశాలు ముగించుకొని చేతులు దులుపుకుంటున్నారు.
రేషన్ కార్డుల జాబితా వట్టి మాటే..
ఎన్నో ఏండ్ల నుంచి ప్రజలకు రేషన్ కార్డులు లేవని, అవి మేమే ఇస్తామని చెప్పి అధికారం చేపట్టినప్పటి నుంచి ఆర్భాటంగా గ్యారెంటీల పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు తండోపతండాలుగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఇంటింటికీ తిరిగి వాటిని పరిశీలించారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేశారు. తీరా నేడు నిర్వహిస్తున్న ప్రజా పాలన సభల్లో రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేవు. 2016 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు జాబితా ఉన్నప్పటికీ, గతేడాది దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు లేవు. ఈ విషయమై అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారివి జాబితాలో వచ్చాయని, విడుతల వారీగా మిగిత వారికి వస్తాయని ఎంపీడీవో డ్యానియల్ పేర్కొంటున్నారు.
అర్హుల ఎంపికపై ఆగ్రహం
ఇందిరమ్మ ఇండ్ల కోసం గతేడాది నిర్వహించిన ప్రజా పాలన సభల్లోనే వందలాదిగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 7,314 మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పడు జాబితాలో 4,337 పేర్లను అధికారులు ప్రకటించారు. వీటిలో తిరస్కారానికి గురైన వాటిని సైతం గ్రామ సభలో వెల్లడించాలని ప్రజలు పేర్కొంటున్నారు. ఇచ్చిన దరఖాస్తులను అధికారులు ఇంటింటికీ తిరిగి పరిశీలించి, ఫొటోలు తీసుకున్నారు. నేడు నిర్వహిస్తున్న ప్రజా పాలన సభల్లో అధికారులు ప్రకటిస్తున్న వాటిలో సగానికి పైగా దరఖాస్తు దారుల పేర్లు కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం రావడం లేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పాలకులు, అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
నెలకొంటుంది.
నిర్బంధంగా వార్డు సభ
తాండూరు : అరకొరగా అమలు చేస్తున్న పథకాల్లో కోతలు, కొర్రీలు పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తీరుపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం ఇచ్చిన హామీలు ఎవరిని అడగాలో తెలియక ఇన్నాళ్లు వేచి చూసిన జనం… ఇప్పుడు గ్రామ, వార్డు సభల పేరుతో జనాల్లోకి వస్తున్న ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు. గ్రామ, వార్డు సభల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సైతం ప్రజలు, బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసులు సభను చుట్టుముట్టి ప్రజలను, బీఆర్ఎస్ నేతలను నిర్బంధంగా ఉంచి సభలు జరిపించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తాండూరు పాత మున్సిపల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వార్డు సభలో గందరగోళం నెలకొన్నది. ఆ సభకు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ అధికారులు ఎవరూ రాకపోవడంతో స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు సభలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్లినా కాంగ్రెస్ కౌన్సిలర్లు వార్డు సభకు ఎవరూ రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు, కౌన్సిలర్ ఆసీఫ్ బసవన్నకట్ట దగ్గర నిర్వహించిన సభవద్ద ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరు కావడంతో అక్కడికి వెళ్లి సమస్యలపై ఫిర్యాదు చేద్దామని వెళ్తుండగా పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల తీరుపై అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరులో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందక పోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ సమస్యలు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు పునరాలోచించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని కోరారు.
అధికారుల నిలదీత
తాండూరు రూరల్ : ప్రజాపాలనలో బీఆర్ఎస్ మద్దతు దారుల పేర్లు ప్రభుత్వ పథకాల జాబితాలో ఎందుకు లేవని ఆ పార్టీ నాయకులు ప్రకాశ్‌తోపాటు పలువురు నిలదీశారు. శుక్రవారం తాండూరు మండలం అంతారంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. అధికారులు రేషన్ కార్డుల జాబితా, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను గ్రామ సభలో చదవి వినిపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి మద్దతుదారుల పేర్లు జాబితాల్లో ఎందుకు లేవని మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్ అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు మాత్రమే అందులో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పేర్లు కూడా చేర్చాలని నిలదీశారు. మరోసారి దరఖాస్తు లు ఇవ్వాలని అధికారులు నాయకులకు సూచించారు. మరోసారి ఇలా జరిగితే గ్రామ సభ జరగనివ్వమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని శాంతింపజేశారు.
అధికారులపై ఆగ్రహం
వికారాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులకు అందించడం లేదంటూ.. ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహిళలు గ్రామ సభకు వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లిలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన అనసూయ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా ఎందుకు కాలేదని, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు వంట గ్యాస్ రూ.500లకే ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మరణించిన వారి పేర్లపై సంక్షేమ పథకాలలో పేర్లు ఎలా వస్తాయని గ్రామ ప్రత్యేక అధికారి దయానంద్‌ను, పంచాయతీ కార్యదర్శి పవిత్రను నిలదీశారు. దరఖాస్తులను తీసుకోవడానికి వచ్చామని, మీరు ఇలా ప్రశ్నిస్తే మేం ఏమి లేమని అధికారులు సమాధానమిచ్చారు. గ్రామ సభకు 52 దరఖాస్తులు వచ్చాయని ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 8, రైతు భరోసా 3, కొత్త రేషన్ కార్డులకు 25, ఇందిరమ్మ ఇండ్లు 15 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎంపీవో దయానంద్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
గ్రామసభలో గ్రూపు రాజకీయాలు
బషీరాబాద్ : ప్రజాపాలన గ్రామ సభ గ్రూపు రాజకీయాలకు వేదికగా మారింది. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ విషయంలో మొదలైన వాగ్వాదం వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లింది. గ్రామ సభ పూర్తిగా ఆరోపణలు ప్రత్యారోపణటకు వేదికగా నిలిచింది. రాష్ట్రం మొత్తంలో ఇందిరమ్మ కమిటీలో ఐదు గురు సభ్యులుంటే బషీరాబాద్‌లో రూపొందించిన ఇందిరమ్మ జాబితాలో తొమ్మిది మంది సభ్యులున్నారని ఓ వర్గానికి చెందిన నాయకుడు ఆరోపించారు. ఓ వర్గం నాయకుడు మాట్లాడుతూ.. బషీరాబాద్‌లో నాయకులు ఎక్కువ కావడంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. స్టేజీపై ఎవరిని పడితే వారిని కూర్చోబెట్టకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన వారిని కూర్చోబెట్టి మిగ తా వారిని పంపించాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12వేలు ఇస్తామని ఇప్పుడు చెప్ప డం ఏమిటని ఓ వర్గానికి చెందిన నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇది ముమ్మాటికీ పేదలను తప్పు తొవ పట్టించడమే కాకుండా వారికి నష్టం జరుగుతున్నదన్నారు. నాయకులు ఆరోపణలు చేసుకోవడంపై గ్రా మ సభకు వచ్చిన గ్రామస్తులు ఇది ప్రజల సమస్యల కోసం పెట్టిన సభనా… లేక వారి వ్యక్తిగత సభనా అని చర్చించుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, మాజీ జడ్పీటీసీ రాకేశ్ , వెంకటేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునీర్, నరేశ్, అనూఫ్ తదితరులు పాల్గొన్నారు.
రసాభాసగా జాపాల గ్రామసభ
ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో అంతా అవకతవకలు జరిగాయని.. ఇండ్లు లేక చిన్నపాటి రేకులు, పెంకు ఇంట్లో ఉన్న వారి పేర్లు జాబితాలో లేకపోవడవంతో ఒక్కసారిగా నిరుపేదలు అధికారులపై తిరుగపడ్డారు. దీంతో చేసేదేమీలేక గ్రామ పంచాయతీలోకి పరుగులు తీశారు. శుక్రవారం మండల పరిధిలోని జాపాలలో జరిగిన ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హుల జాబితాను పక్కనపెట్టి కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఇండ్లు, భవనాలు ఉన్నవారి పేర్లను జాబితాలో చదవడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాపాలలో 292 మంది ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు అర్హుల జాబితాను అధికారులు చదవడంతో ఒక్కసారిగా మహిళలు తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవంటూ అధికారులను నిలదీశారు.
కాలయాపన కోసమే గ్రామసభలు
ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, రైతుభరోసాకు సంబంధించి అర్హుల ఎంపిక పక్రియ మొత్తం ఏకపక్షంగా జరిగిందని సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు గ్రామసభలో నిలదీశారు. ఎవరికోసం ఈ గ్రామ సభలు పెడుతున్నారని సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయనుకుంటే అవి ఒక పార్టీకి చెందిన నాయకులకే చేరుతున్నాయన్నారు. పేరుకు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగరాజు, పద్మారెడ్డి, రాంరెడ్డి, బియ్యని సతీశ్, సీపీఎం నాయకులు పాపిరెడ్డి, యాట జగన్, యాట పాండు, లెలిన్, భాస్కర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
తూతూ మంత్రంగా గ్రామసభలు
మండల పరిధిలో ప్రజాపాలన గ్రామ సభలు చివరిరోజు తూతూ మంత్రంగా ముగిసాయి. శుక్రవారం మేడిపల్లి, చింతపట్ల, మొండిగౌరెల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్దలో గ్రామ సభలు నిర్వహించారు. ఇవన్నీ సమస్యాత్మక గ్రామాలు కావడంతో యాచారం సీఐ నరసింహారావు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు, ఎస్సై మధు, తేజంరెడ్డి, సత్యనారాయణ పర్యవేక్షణలో స్థానిక పోలీసులతో పాటు భారీగా స్పెషల్ పోలీసులను దింపారు. ముఖ్యంగా మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలు ఫార్మాసిటీ బాధిత గ్రామాలు కావడం.. పైగా మండల పరిధిలోనే అతి సమస్యాత్మక గ్రామాలు కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆయా గ్రామాల్లో ఏకంగా బీఎస్ఎఫ్ బలగాలను భారీగా దింపారు. కుర్మిద్దలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు హాజరై ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకోకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామ సభల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తెగ జాగ్రత పడ్డారు. పోలీసుల నిర్బంధంలోనే గ్రామసభలు నిర్వహించారు.
అధికారులు సైతం గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించి, తూతూ మంత్రంగా మాట్లాడి, నూతన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని తమ సిబ్బందికి అప్పజెప్పి గ్రామ సభలను సమయం ముగియక ముందే మమ అనిపించారు. కుర్మిద్దలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఉపాధి హామీ పథకానికి సంబంధం లేకుండా భూమిలేని పేదలందరికీ వర్తించేలా చూడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఎంపీడీవో నరేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని మొండిగౌరెల్లి గ్రామస్తులు వ్యవసాయాధికారి రవినాథ్కు వినతిపత్రం అందజేశారు. అనర్హులకు ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని మేడిపల్లిలో అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీవో నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దరఖాస్తుల స్వీకరణకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీలత, డిప్యూటీ తహసీల్దార్ కీర్తి సాగర్, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.