ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పది-పదిహేను రోజులు దాటుతున్నా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లింపులు పూర్తికాలేదు. కొందరు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి పది రోజులైనా ఇంకా డబ్బులు ఖాతాల్లో జమ కాలేదంటున్నారు. ధాన్యాన్ని సేకరించిన అనంతరం వెంటనే బిల్లులు చేయాల్సిన కొనుగోలు కేంద్రాల సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోపాటు ప్రభుత్వం సమయానికి డబ్బులు రిలీజ్ చేయకపోవడంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.
– వికారాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఇప్పటివరకు 3114 మంది రైతుల నుంచి 15,536 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 36.04 కోట్ల విలువైన ధాన్యానికి, రూ.20.33 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. 6775 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ.15.71 కోట్ల చెల్లింపులు పూర్తి చేయగా, పెండింగ్ డబ్బులపై వెంటనే అధికారులు స్పందించి త్వరగా అందేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూసి పూర్తిగా నష్టపోకుండా దళారులను ఆశ్రయిస్తున్నారు. తరుగు పేరిట రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. 50 కిలోల బస్తాలో 5 కిలోల వరకు తరుగు తీస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే కొర్రీలు పెడుతూ ధాన్యం విక్రయించే రైతులకు నష్టం కలిగిస్తుండడంతో ప్రైవేట్ వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 92 వేల ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ప్రతి రైతుకూ మద్దతు ధర అందించేలా చర్యలు చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల విషయంలో అన్నింటిలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో వరి కోతకు వచ్చిన సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియ జరిగేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు.
జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు వరి కోతలు పూర్తి చేసి పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడంలో మాత్రం ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. దీంతో చాలా మంది రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులున్నాయి. వరి కోతలు పూర్తి చేసి కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి ఎప్పుడెప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందోనని పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు తూకం షురూ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షానికి ధాన్యం తడుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1266 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
మరోవైపు జిల్లావ్యాప్తంగా 128 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 85 కేంద్రాల్లోనే ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. మిగతా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు. యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 128 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. వీటిలో ఐకేపీ ద్వారా 41, పీఏసీఎస్ ద్వారా 49, డీసీఎంఎస్ ద్వారా 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. వీటిలో సన్నరకం వడ్లను కొనుగోలు చేసేందుకు 11 కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించింది. రైతులకు అందించే మద్దతు ధరకు సంబంధించి క్వింటాలుకు ఏ గ్రేడ్ రూ.2320, సాధారణ రకం క్వింటాలుకు రూ.2300లుగా ప్రభుత్వం నిర్ణయించింది.