వికారాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తైన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తైనప్పటికీ సర్కారు బడులను బాగు చేసేందుకు ఖర్చు చేసిన పైసలను కాంట్రాక్టర్లకు ఇంకా విడుదల చేయలేదు. గత ఏడాదిన్నరగా కలెక్టర్‌కు ప్రతి సోమవారం ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేస్తున్నప్పటికీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న బిల్లులకు నిధులకు మోక్షం లభించలేదు. సర్కారు కేవలం కొడంగల్ నియోజకవర్గంపైనే ప్రేమ చూపిస్తూ వేల కోట్ల నిధులను విడుదల చేస్తూ జిల్లాలోని మిగతా వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు మొండిచెయ్యి చూపిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అమల్లోకి తీసుకువచ్చిన మన ఊరు-మన బడిలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ప్రస్తు సర్కారు వివక్ష చూపిస్తుండడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం.. వారికే అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కాంట్రాక్ట్‌ను కూడా అప్పగించింది. మరోవైపు వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు తమ భార్య పుస్తెలతాడు అమ్మి ప్రభుత్వ స్కూళ్లలో పనులు చేశామని కొందరు, చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేకపోతున్నామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మరోసారి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలంటూ కలెక్టర్‌కు కాంట్రాక్టర్లు వినతిపత్రం అందజేశారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా..
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తైనా బిల్లులు రాకపోవడంతో వాటి కోసం కాంట్రాక్టర్లు గతేడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. స్కూల్ కమిటీలు, సంబంధిత అధికారుల ఒత్తిడితో పలు స్కూళ్లలో పనులు పూర్తి చేసిన చిన్నచిన్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు పూర్తి చేసిన వారిలో చాలా వరకు స్కూల్ కమిటీ సభ్యులే ఉండడం, అప్పులు చేసి పనులు పూర్తి చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్, ప్రజాభవన్, సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తుండడంతో చెల్లింపుల ప్రక్రియ పెండింగ్‌లోనే కొనసాగుతున్నది.
పనులకు సంబంధించి ఎంబీలు కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేసినప్పటికీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు త్వరలో నిధులు విడుదలవుతాయని దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారు. సర్కారు బడులను బాగు చేసేందుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేస్తే నిధులిచ్చేందుకు కక్ష సాధింపు చర్యలు చేయడంపై కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 371 స్కూళ్లను మన ఊరు-మన బడిలో భాగంగా ఎంపిక చేయగా, 20 స్కూళ్లలో పనులు పూర్తికాగా స్కూళ్లను కూడా గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 300 స్కూళ్లలో పనులు 20-50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. సంబంధిత పనులకు సంబంధించి రూ.10 కోట్ల చెల్లింపులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.