పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘రేటెంత’ రెడ్డిగా మారాడు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు తీసుకుంటుండు.. అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం తాండూరులో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ కబ్జాల విచారణకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా ?.. నువ్వెంత..? నీ బతుకెంత..? నువ్వొక బ్రోకర్, చీటర్, దమ్ముంటే కొడంగల్‌లో గెలువు చూద్దాం.. అంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ పీనుగు… 6 గ్యారంటీలతో లేస్తదా అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని, తాండూరులో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్నారు.
– తాండూరు, అక్టోబర్ 29
తాండూరు, అక్టోబర్ 29: నాడు ఓటుకు నోటు నేడు సీటుకు నోటు… ఇప్పుడు రేవంత్‌రెడ్డి కాదు ‘రేటెంత’ రెడ్డిగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బస్సుయాత్ర ప్రారంభంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో పాటు తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ మాట్లాడడంపై ఫైర్ అయ్యారు.
తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్ల అభివృద్ధి పనులు, రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తే ఏమీ జరుగలేదని రేవంత్‌రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్‌తో పాటు నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. నువ్వెంత..? నీ బతుకెంత..? నువ్వొక బ్రోకర్, చీటర్, దమ్ముంటే కొడంగల్‌లో మా బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిపై గెలువు చూద్దామని సవాల్ చేశారు.
కబ్జాల విచారణకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా..? గుడి, మసీద్, చర్చీ ఎక్కడికి రమ్మంటే అక్కడకి వస్తా నువ్వు రా… నీ కబ్జాల చిట్టా చూపిస్తానని మీడియా ముందు రేవంత్‌రెడ్డి భూ కబ్జాల పత్రాలను చూపించారు. గత ఎన్నికల్లో అఫిడవిట్లో నువ్వు చూపించిన ఆస్తుల వివరాలు ఎన్ని..? అక్రమంగా ఇప్పుడు ఎన్ని సంపాదించావనేది నేను చూపిస్తానన్నారు. తెలంగాణలో ముందెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ సీట్లను అమ్ముకున్నాడని, కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని సొంత పార్టీ వారే అంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ అభ్యర్థుల టికెట్లను ఫర్ సేల్కు పెట్టి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పీనుగు… 6 గ్యారంటీలతో లేస్తదా అని ఎద్దేవా చేశారు. వారంటీ లేని 6 కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను చూస్తే గమ్మత్తుగా ఉందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు ప్రజలను మోసం చేసేవిధంగా ఉన్నాయని తెలిపారు.
ఎవరెన్ని కుయుక్తులు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు. గత పథకాలను అమలు చేస్తూ నూతనంగా మళ్లీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఎకరానికి రూ.16 వేల రైతు బంధు, సౌభాగ్యలక్ష్మి పేరుతో పేద మహిళలకు రూ.3000, రూ.400లకే వంటగ్యాస్, ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా వైద్య చికిత్సలకు రూ.15 లక్షలు, రేషన్‌పై సన్నబియ్యం, అర్హులైన వారికి రూ.5016 ఆసరా పెన్షన్లు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలతో పాటు పలు నూతన పథకాలను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.
తాండూరు కాంగ్రెస్ అభ్యర్థికి తాండూరు నియోజకవర్గం గురించి ఏమి తెలియదని విమర్శించారు. డబ్బులు పోసి టికెట్ కొని ప్రజలను డబ్బులతో కొనాలని చూస్తే ప్రజలు మోసపోరని ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. తాండూరులో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, కరుణం పురుషోత్తంరావు, గులాబీ నేతలు నయీం, శ్రీనివాస్‌చారి, రవీందర్, కౌన్సిలర్లు ఉన్నారు.