వికారాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు చర్యలు చేపట్టారు. గత రెండు, మూడేండ్లుగా రుణాలను తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలను గుర్తించి రుణాలను వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ జిల్లాలోని కొన్ని సంఘాల్లో ఇంకా మార్పు రావడంలేదు. జిల్లావ్యాప్తంగా 839 స్వయం సహాయక సంఘాలు మొండికేయడంతో రూ.22.85 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు.
ఈ మొత్తాన్ని సంబంధిత స్వయం సహాయక సంఘాల నుంచి తిరిగి వసూలు చేసేందుకు నెలవారీగా టార్గెట్‌ను నిర్దేశించుకొని డీఆర్డీవో యంత్రాంగం చర్యలు చేపట్టింది. పూర్తిగా పనిచేయని సంఘాలను కూడా యాక్టివ్ చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తున్నారు. రుణాలను తిరిగి చెల్లించని సంఘాలకు రుణాలను ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయకూడదని బ్యాంకు అధికారులకు కూడా డీఆర్డీఏ యంత్రాంగం సమాచారమిచ్చింది. జిల్లావ్యాప్తంగా 12,693 స్వయం సహాయక సంఘాలుండగా.. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.446 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు.
జిల్లావ్యాప్తంగా రూ.22.85 కోట్ల రుణాలను స్వయం సహాయక సంఘాల నుంచి రికవరీ చేయాల్సి ఉంది. జిల్లాలోని పలు సంఘాలు రుణాలు మంజూరైన మరునాటి నుంచి సంఘాల కార్యకలాపాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని సంబంధిత అధికారులు గుర్తించారు. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేయడంతోపాటు మరింత బలోపేతం చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మొత్తం స్వయం సహాయక సంఘాల పనితీరును ఆరా తీసి, ముఖ్యంగా పనిచేయని స్వయం సహాయక సంఘాలను దారిలోకి తెచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పనిచేయని సంఘాల్లో కదలిక తీసుకువచ్చేందుకు తిరిగి యాక్టివ్‌గా పనిచేసేందుకు కొత్తగా రుణాలను మంజూరు చేయబోమని కూడా హెచ్చరిస్తూ, బకాయిలను వసూలు చేసే పనిలో ఉన్నారు. స్వయం సహాయక సంఘాల పనితీరు.. సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నారా, ఎంత మంది సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు, సంబంధిత ఎస్హెచ్జీకి ఎంత అప్పు ఉంది, ఎంత డబ్బు పొదుపు చేశారనే విషయాలను స్వయం సహాయక సంఘాల ద్వారా సేకరిస్తూ, యాక్టివ్‌గా పనిచేయని సంఘాల్లో మార్పు తీసుకువచ్చే దిశగా వెళుతున్నారు.
మొండికేసిన సంఘాలపై దృష్టి సారించాం
జిల్లాలో మొండికేసిన సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు తగు చర్యలు చేపట్టాం. జిల్లాలో ఎన్పీఏ సంఘాలను గుర్తించి, సంబంధిత సంఘాల నుంచి పెండింగ్ బకాయిలను వసూలు చేస్తామని, అదేవిధంగా యాక్టివ్‌గా పనిచేయని సంఘాల్లో మార్పు తీసుకువచ్చేందుకు తగు చర్యలు చేపడుతాం. పెండింగ్ బకాయిలున్న సంఘాలకు రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకర్లకు సూచించాం. – డీఆర్డీవో శ్రీనివాస్
పెండింగ్‌లో రూ.22.85 కోట్ల బకాయిలు
జిల్లావ్యాప్తంగా 839 స్వయం సహాయక సంఘాల నుంచి రూ.22.85 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తాండూరు, పూడూరు, పెద్దేముల్, ధారూరు మండలాల్లో మొండికేసిన సంఘాలు అధికంగా ఉన్నాయి.
