ప్రస్తుత కాలంలో ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు బిజీ జీవితాలు.. ఉరుకులు, పరుగులు, సమయానికి తిండి తినకుండా ఉండడం, ఒత్తికి లోను కావడం వంటి కారణాలతో రోగాల బారినపడుతున్నారు. అధునాతన యుగంలో అన్ని పనులకు యంత్రాలను ఉపయోగించడం అనివార్యమైంది. దీంతో రోగాలు అంతే తొందరగా వస్తున్నాయి. చిన్న వయస్సు నుంచే శరీరం అనేక రుగ్మతలకు నిలయంగా మారుతోంది. ఊబకాయంతో బాధపడేవారు కోకొల్లలు. మరిమన జీవన శైలిలలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఇలాంటి రోగాలకు చెక్ పెట్టేయొచ్చు. నిత్యం వ్యాయామం చేసి ఫిట్నెస్గా ఉంటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
తాండూరు, డిసెంబర్ 16 : బిజీ లైఫ్‌లో సైతం నేటి యువత ఫిట్నెస్ మంత్రాన్ని వల్లెవేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు కండరాలు తిరిగిన శరీరం, స్లిమ్ కోసం యువతియువకులు జిమ్‌లకు వెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం తమకు అనుకూలమైన ప్రదేశాల్లోని ‘జిమ్’లకు (వ్యాయామ శాలలకు) వెళ్లి వ్యాయామం చేస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల బొజ్జ తగ్గడంతో పాటు శరీరంలో ఇతర అవయవాల్లో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ (కొవ్వు)ను తగ్గించుకోవచ్చు. ఫిట్‌గా ఉండేందుకు కోచ్‌ల దగ్గర సలహాలు, సూచనలు తీసుకొంటున్నారు. వ్యాయామాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తే తప్పక ఫలితాలు ఉంటాయని జిమ్‌ల కోచ్‌లు, యువకులు పేర్కొంటున్నారు.
అనారోగ్య సమస్యలకు చెక్..
జిమ్‌లలో పలు రకాల ఎక్సర్సైజ్లు చేయడం వల్ల దేహదారుఢ్యంతో పాటు మంచి శరీరాకృతి ఏర్పడడమే కాకుండా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ బరువు ఉన్న వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువు తగ్గడంతో పాటు నడి వయస్కులకు కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి పాదాలపై, మడమ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె జబ్బులున్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకే ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుందని కోచ్‌లు సూచిస్తున్నారు.
యువకుల సందడి..
తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని పల్లెల యువకులు వ్యాయామంపై మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఉదయం 5 గంటలకే జిమ్‌ల వద్దకు చేరుకుంటున్నారు. పట్టణంలోని మూడు జిమ్‌లలో యువకులు కిటకిటలాడుతున్నారు.
ఫిట్నెస్తో పాటు ఆరోగ్యం..
ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలో జిమ్‌లలో శారీరక దేహదారుఢ్యాన్ని తీర్చి దిద్దుకునేందుకు యువకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ పట్టణాలతో సమానంగా అన్ని సౌకర్యాలతో, అన్ని రకాల వ్యాయామ పరికరాలను తాండూరులోని జిమ్‌లో ఏర్పాటు చేశాం. ఎక్సర్సైజ్ పరికరాలను బట్టి ధరలు నిర్ణయించాం. ఈ ప్రాంతంలోని యువకులను ప్రోత్సహించాలని ప్రముఖ పట్టణాల్లో జిమ్‌లలో వసూలు చేస్తున్న ధరల్లో నాలుగోవంతు ధరకే, కేవలం నిర్వహణ చార్జీలతో మాత్రమే రకరకాల వ్యాయామం చేసేందుకు యువకులకు అవకాశం కల్పిస్తున్నాం. యువకులు కూడా జిమ్ సెంటర్‌కు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. – ఫెరోజ్ జిమ్ కోచ్