వికారాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక నజర్ పెట్టింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాల్లో లక్షల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఆ పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సర్(ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు సంబంధించి ఒక్క ఓటు కూడా కోల్పోకుండా కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా ఇన్‌చార్జీలనూ పార్టీ నియమించింది.
జిల్లాకు ఇన్చార్జిగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డిని నియమించగా, నియోజకవర్గాల వారీగా వికారాబాద్‌కు గట్టు రాంచంద్రరావు, తాండూరుకు విప్లవ్‌కుమార్, పరిగికి శ్రీనివాసరావులను నియమించి ఓట్లు గల్లంతు కాకుండా ప్రత్యేక దృష్టి సారించింది. సర్‌పై వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన మీటింగుల్లో జిల్లా ఇన్చార్జి సబితాఇంద్రారెడ్డి పాల్గొని ఓట్లు గల్లంతు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ శ్రేణులకు సూచించారు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా ప్రతి బూత్కూ ఇద్దరు ఏజెంట్లను ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు నియమించి కసరత్తు చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసి ఓట్లను గల్లంతు చేశారనే ఆరోపణలతో ఆ పరిస్థితి రాకుండా అత్యంత ప్రాధాన్యతనిస్తూ పార్టీ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించి, పార్టీ శ్రేణులకు సర్(ఎస్ఐఆర్)పై అవగాహన కల్పించనున్నారు. ఈనెల 25న పరిగి నియోజకవర్గంలో, ఈనెల 28న వికారాబాద్ నియోజకవర్గంలో జరిగే సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నెల 25 నుంచి ఇంటింటి సర్వే..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఇప్పటికే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కొంతమేర పూర్తికాగా, మిగతా ఓటర్ల మ్యాపింగ్‌కు సంబంధించి ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యం త్రాంగం కసరత్తు చేస్తున్నది. సర్(ఎస్ఐఆర్)పై ఇంటింటి సర్వేకు జిల్లాలోని బీఎల్వోలకు కొనసాగుతున్న శిక్షణ నేటితో ముగియనున్నది. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ఇం టింటి సర్వే చేపట్టనున్నారు. జూలై 24 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధ్దీకరణ, జూలై 31న ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం వెల్లడించనున్నది.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించి, తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న విడుదల చేయనున్నారు. సర్ ప్రకారం 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటరు జాబితా నుంచి మరణించిన వారితోపాటు డుప్లికేట్ ఓటర్లు, శాశ్వతంగా వలసవెళ్లిన వారు, అనర్హుల పేర్లను తొలగించనున్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఓటర్ల వద్దకు వెళ్లే బీఎల్వోలు 12 పేజీలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయనున్నారు. ఆ ఫారాన్ని పూర్తి చేసి తిరిగి బీఎల్వోలకు అందజేయాలి. ఓటరు తప్పనిసరిగా మ్యాపింగ్ చేయించుకోవాలి. 2002, 2025 ఓటరు జాబితాలో పేరు ఉన్న ఓటర్లు బీఎల్వోలు ఇంటింటి సర్వేలో భాగంగా వచ్చిన సమయంలో సెల్ఫ్ మ్యాపింగ్ చేయించుకోవాలి. 2002లో ఓటు హక్కు వయస్సు రాకపోయి, ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్న వారికి వర్తించనుంది.
జిల్లాలో 7,85,495 ఓటర్లకు మ్యాపింగ్ పూర్తి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 77.65 శాతం మేర ఓటర్ల మ్యాపింగ్ పూర్తయ్యింది. జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగా, 7,85,495 మంది ఓటర్లకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేశారు. మరో 2,27,454 మంది ఓటర్లకు పూర్తి చేయాల్సి ఉన్నది. పరిగి సెగ్మెంట్‌కు సంబంధించి 84.08% పూర్తి కాగా, 2,32,111 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. వికారాబాద్ సెగ్మెంట్లో 79.98% పూర్తికాగా, 1,84,674 మంది ఓటర్లకు సంబంధించి.. తాండూరు సెగ్మెంట్లో 66.29% పూర్తికాగా, 1,65,637 మంది ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
కొడంగల్ సెగ్మెంట్‌కు సంబంధించి 79.78% పూర్తికాగా, 2,00,073 మంది ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరగగా, ప్రస్తుతం మళ్లీ ఎస్ఐఆర్ను ఎన్నికల సంఘం చేపట్టింది. 2002 ఓటరు జాబితాతోపాటు 20 25 ఓటరు జాబితాను బీఎల్వోలకు అందించి 2002 ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటికెళ్లి పాత లిస్ట్‌లోని పేర్లను కొత్త జాబితాలోనూ ఉన్నట్లయితే మ్యాపింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా 2002లో ఓటరు జాబితాలో పేరు లేకుండా ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లయితే అప్పటి జాబితాలో కుటుంబీకుల పేరు ఉంటే వారిని ఆధారంగా తీసుకొని మ్యాపింగ్ చేస్తున్నారు.