పరిగి : రోడ్డు వెడల్పుతో పాటు ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణం ద్వారా పట్టణం మరింత సుందరంగా మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని గంజ్‌రోడ్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రూ. 15కోట్లు మంజూరు చేయించగా రూ. 10కోట్ల విలువ చేసే పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఇరుకుగా ఉన్నటువంటి గంజ్‌రోడ్డులో ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణం, డివైడర్‌తో కూడిన రోడ్డు నిర్మాణంతో మరింత విశాలంగా రహదారి ఏర్పడి, సెంట్రల్ లైటింగ్‌తో పట్టణం మరింత సుందరంగా మారుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న అభివృద్ధికి ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. పనులలో వేగం పెంచాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని ఆయన సూచించారు.
అనంతరం పోస్టాఫీసు సమీపంలోని రామాలయం పక్కన కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భవిష్యత్తులో మరో ముప్పై ఏళ్ల వరకు సరిపోయే స్థాయిలో రోడ్లు, ఇతర పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పరిగి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంగు సంతోష్‌కుమార్, కౌన్సిలర్లు వేముల కిరణ్, మునీర్, నాగేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.