మాట్లాడిందంతా ఎన్నికల ప్రచారంపరిగి, ఫిబ్రవరి 7 : రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తారు కానీ శనివారం రోజు పరిగి మండలం నారాయణపూర్ శివారులో నిర్వహించిన బహిరంగసభతో పరిగి మున్సిపాలిటీకి, నియోజకవర్గానికి ప్రత్యేకంగా ప్రయోజనం కలగలేదన్నది వాస్తవం. పరిగి మండల పరిధిలో బహిరంగసభ నిర్వహించి పరిగి మున్సిపాలిటీకి, నియోజకవర్గానికి ఒక్క రూపాయి ప్రత్యేకంగా ప్రకటించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రధానంగా పరిగి మున్సిపాలిటీలో ఇటీవల అయిదు గ్రామపంచాయతీల విలీనంతో విస్తరించింది. తద్వారా పరిగి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని గతంలో ఎమ్మెల్యే ప్రకటించారు. కాగా స్థానిక ఎమ్మెల్యే తన ప్రసంగంలో ఔటర్ రింగ్ రోడ్డు అంశం ప్రస్తావించకపోవడం గమనార్హం. పరిగికి ఔటర్ రింగ్ రోడ్డు ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రధానంగా హైదరాబాద్-ముంబయి, హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారులను కలిపేది సదాశివపేట్ నుంచి వికారాబాద్, పరిగి మీదుగా షాద్‌నగర్ రహదారి. ఈ నేపథ్యంలో భారీ వాహనాలు పరిగి పట్టణం నుంచి కాకుండా పట్టణ శివారు నుంచి వెళ్లడం ద్వారా పట్టణంలో వాహనాల రద్దీ తగ్గడం, వాహనదారులకు సులభంగా రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది.
సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో పరిగి చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం ప్రకటిస్తారని ఆశించగా.. కనీసం ఊసెత్తకపోవడం గమనార్హం. మరోవైపు పరిగి మున్సిపాలిటీతోపాటు జిల్లాలోని మున్సిపాలిటీలను మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డిని మున్సిపల్ శాఖ మంత్రి వలె పెట్టి అభివృద్ధి చేస్తామని ప్రకటించడం ఎవరికీ అంతుపట్టని వ్యవహారంగా మారింది. నారాయణపూర్ శివారులో ప్రభుత్వ కార్యక్రమంగా ఏర్పాటుచేసిన బహిరంగసభకు ఖర్చంతా ప్రభుత్వమే పెట్టి, బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాన్ని తరలించగా సభలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి మొదలు స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు, మండలిలో చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి తమ ప్రసంగంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నేరుగా కోరడం ద్వారా కాంగ్రెస్ ప్రచార సభను తలపించింది. ప్రభుత్వ నిధులతో సభ పెట్టి కేవలం ప్రతిపక్షాన్ని తిట్టడానికే పరిమితం కావడం, తాము ఇప్పటివరకు పరిగికి ఏమి చేశాము, భవిష్యత్తులో ఏమి చేస్తామన్నది స్పష్టం చేయకపోవడం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఏ సభకైనా ఓ ప్రొటోకాల్ ఉంటుంది. నారాయణపూర్ శివారులో నిర్వహించిన సభా వేదికపై కాంగ్రెస్ నాయకులందరూ కూర్చోగా నారాయణపూర్ గ్రామ సర్పంచ్‌కు కనీసం ఆహ్వానం లేకపోవడం కొసమెరుపు.
ఆర్థిక పరిస్థితి మెరుగవ్వగానే హామీల అమలు : స్పీకర్
ఈ సభలో వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. కొన్ని వాగ్దానాలు ప్రముఖమైనవి ఉన్నాయని, ఆర్థిక పరిస్థితి గాడిలో పడిన తర్వాత ఏడాదిలోపు అమలు చేస్తామని పేర్కొన్నారు. చేవెళ్ల-ప్రాణహితను తీసుకువచ్చి సాగునీరు అందించాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి పథకం విషయం రాష్ట్రంలోనే మొదటగా తనకు తెలుసన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నపుడు పైప్‌లైన్ ద్వారా రూ.500 కోట్లతో కృష్ణా నీటిని తీసుకొచ్చి తాగునీరు అందించాలని కోరగా వెంటనే ఆయన అంగీకరించి సర్వేకు ఆదేశించారన్నారు. కృష్ణా, గోదావరి నీటిని తీసుకువస్తే మూడు నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలంగాణకు వస్తున్నారని, వికారాబాద్ ప్రాంతంలో వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, అక్కడ భూమి కేటాయిస్తే వికారాబాద్ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరుగుతుందన్నారు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ పొడిగించాలని కోరారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సీఎం, అసెంబ్లీ స్పీకర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులని, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగాలని సీఎం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. అనంతరం శాసనమండలిలో చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, యాదయ్య, ప్రకాష్‌గౌడ్, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులున్నారు.