పరిగి : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకుఆనంద్ ప్రారంభించారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి స్వయంగా రక్తదానం చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. పరిగిలోని టీటీడీ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రారంభించారు.
బొంరాస్‌పేట మండలం అల్లికాన్పల్లిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. 17వ తేదీ గురువారం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం సన్నాహాలు చేసింది.