పరిగి, ఏప్రిల్ 15 : వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ పండుగను విజయవంతం చేద్దామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కోరారు. సభకు ప్రతి ఊరు నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా మంగళవారం పరిగిలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజుల్లో మండల స్థాయిలో నాయకులు కూర్చొని ఏ ఊరుకు బస్సు పెట్టాలి, సొంత వాహనాలు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలు అందజేయాలన్నారు.
27న ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. గ్రామాల నుంచి ఉదయం 7 గంటలకే మహాసభకు బయలుదేరాలన్నారు. సభకు వచ్చే వారికి భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. మహాసభ తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం మేరకు పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సభ తర్వాత గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గులాబీ పండుగకు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ గుండెలదిరేలా చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్ల పాటు ఉద్యమంలో ప్రజలు, యువత, ఉద్యోగులందరినీ భాగస్వాములను చేసి రాష్ర్టాన్ని సాధించిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలువగా, 16 నెలల కాంగ్రెస్ పాలనలో 14వ స్థానానికి దిగజారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 420 దొంగ హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 11 పర్యాయాలు రైతు బంధును అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వానకాలం డబ్బులు ఎగ్గొట్టిందని, యాసంగికి రూ.6వేలు ఎకరాకు చొప్పున మార్చి 31 వరకు ఇస్తామని చెప్పి, ఏప్రిల్ 15వ తేదీ వచ్చినా అందరికీ సంపూర్ణంగా రైతు బంధు ఇవ్వలేదన్నారు. రూ.2లక్షలు రుణమాఫీ సైతం సంపూర్ణంగా చేయలేదని విమర్శించారు. రూ.2వేల పింఛన్‌ను ఇంట్లో ఒకరికే ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే ఇద్దరికి ఇస్తామని, రూ.4వేలకు పింఛన్ పెంచుతామని కాంగ్రెస్ వారు ప్రగల్భాలు పలికారన్నారు.
ఇంటింటికీ 200 యూనిట్లు ఉచిత కరెంటు, రూ.500లకు వంటగ్యాస్ సిలిండర్లు 30 నుంచి 40 శాతం మందికే వస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి పాలనపై పట్టులేదని, సీఎం, మంత్రులకు సరైన అవగాహన లేదన్నారు. మన రోజులు తప్పనిసరిగా వస్తాయని, అనునిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ పోరాటం చేద్దామన్నారు. ఎవరికి ఏమి అవసరమొచ్చినా 24 గంటలు పనిచేస్తామని, ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా తనకు ఫోన్ చేసి చెప్పాలని మహేశ్‌రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్‌ను పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి బహిరంగసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సభకు సంబంధించి ప్రతి గ్రామంలో వాల్ పెయింటింగ్ చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు నాగారెడ్డి, రాందాస్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు అనిల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీపీ మల్లేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మీర్‌మహమూద్‌అలీ, రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మల్లేశం, అజీమ్, భాస్కర్, సునంద, శ్రావణ్‌రెడ్డి, రామన్న మాదిగ, వెంకటయ్య, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బడంగ్పేట్ : 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రామిడి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అధోగతిపాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు.
హామీలు నెరవేర్చని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయిపోయిందన్నారు. రైతులు, కూలీలు, ఏ వ్యాపారిని పలుకరించినా కన్నీటిపర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత రేవంత్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఏమైపోతుందోననే సోయి ముఖ్యమంత్రికి లేదన్నారు. కేసీఆర్ పేరు లేకుండా చేయాలని రేవంత్‌రెడ్డి అనుకుంటే.. అది సాధ్యమయ్యే పని కాదన్నారు.
ప్రజల గుండెల్లో కేసీఆర్ సుస్థిరంగా ఉన్నారని.. ఆయన వెంట నడవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రజతోత్సవ సభకు ప్రజలు వెళ్లకుండా పోలీసులు అనేక ఆంక్షలు పెడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ అధ్యక్షుడు సర్దార్ పురుషోత్తంరావు, మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, కందుకూరు మండలాధ్యక్షుడు జయేందర్‌ముదిరాజ్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిరెడ్డి, తుక్కుగూడ మున్సిపల్ అధ్యక్షుడు లక్ష్మయ్య, గడ్డిఅన్నారం మాజీ చైర్మన్ రామ్నరసింహగౌడ్, నాయకులు వెంకట్‌రెడ్డి, దీప్లాల్చౌహాన్, సునీత, బీరప్ప, నరసింహారెడ్డి పాల్గొన్నారు.