రంగారెడ్డి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/ఆదిబట్ల : ప్రజలంతా బతుకమ్మ సంబురాల్లో ఉంటే పంచాయతీ కార్మికులు మాత్రం పం డుగ పూట పస్తులుండాలా..? అని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు ప్రభుత్వంపై మండిపడ్డారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ..జిల్లాలో పని చేస్తున్న పంచాయతీ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా వేతనాలు రాకపోవడంతో పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. అప్పులు తీసుకొచ్చి కుటుంబాలను పోషించాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలను దసరా పండుగ లోపు చెల్లించడంతోపాటు సబ్బులు, నూనె, ఇతర సేఫ్టీ పరికరాలను అందజేయాలన్నారు.
అలాగే పంచాయతీ సిబ్బందిని పీఆర్సీ పరిధిలోకి తీసుకోవాలని, జీవో 60 ప్రకారం వేతనాలను చెల్లించాలన్నారు. అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్కు అందజేశారు. నిరసనలో సీఐటీయూ నాయకులు కృష్ణ, పాండు, వెంకటేశ్, కృష్ణ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.