పరిగి, జూన్ 19 : పచ్చదనానికి, పరిశుభ్రతకు నిలయంగా గ్రామాలను తీర్చిదిద్దడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వగా కాంగ్రెస్ ప్రజా పాలనలో ఏకంగా చెత్త సేకరణ వ్యవస్థ కుప్పకూలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికే గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయాయి. ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారుల మాట తీరుతో నొచ్చుకున్న పంచాయతీ కార్యదర్శులు ఆర్థికపరమైన విధులను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ ట్రాక్టర్ల తాళం చేతులు మండలాభివృద్ధి అధికారులకు అప్పగించారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో 595 గ్రామపంచాయతీలున్నాయి. ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్‌ను సైతం ఏర్పాటు చేయించడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరిపి ట్రాక్టర్ ద్వారా చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తీసుకువెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేయడంతోపాటు కంపోస్టు ఎరువు తయారీకి రూపకల్పన చేసి అమలు చేసింది. ప్రభుత్వ విధానంతో గ్రామాలలో చెత్త సమస్య పరిష్కారమవడంతోపాటు రోడ్లపై చెత్త వేసేవారు కాదు.
అధికారుల తీరుతో అడ్డం తిరిగిన కథ
తమకు ఏడాదికిపైగా రావాల్సిన బిల్లులు మంజూరు చేయాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులు అధికారులకు మొరపెట్టుకోగా మిమ్మల్ని ఎవరు ఖర్చు చేయమన్నారు, మేము చెప్పామా అంటూ పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఓ రాష్ట్ర స్థాయి అధికారి, జిల్లాలో పనిచేసే మరో అధికారి పేర్కొనడంతో ఆశ్చర్యపోవడం కార్యదర్శుల వంతైంది. ఏడాదికిపైగా వివిధ పనుల కోసం తాము ఖర్చు చేసిన డబ్బులు మంజూరు చేయకపోవడం అటుంచి.. మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటూ ఉన్నతాధికారులే మాట్లాడడంతో అవాక్కైన పంచాయతీ కార్యదర్శులు ఇకమీదట ఆర్థికపరమైన విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఆయా మండలాలవారీగా పంచాయతీ కార్యదర్శులు సమావేశాలు నిర్వహించుకొని ఆర్థికపరమైన విధుల నిర్వహణ తమవల్ల కావడం లేదని, వాటిని బహిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ ట్రాక్టర్ల తాళం చేతులు ఎంపీడీవోలకు అందజేయడం ప్రారంభించారు. జిల్లా పరిధిలో ఇప్పటికే పలు మండలాల్లో గ్రామపంచాయతీ ట్రాక్టర్ల తాళం చేతులు అధికారులకు అందజేయగా.. మిగతా మండలాలు అదే బాటలో ఉన్నాయి. ప్రతి రోజూ లేదా రోజు తప్పించి రోజు తమ ఇళ్ల దగ్గరకు వచ్చి చెత్త సేకరణ చేసే ట్రాక్టర్ రావడం లేదని ఆయా గ్రామాలవారు వాపోతున్నారు.
చెత్త సేకరణ నిలిచిపోగా, ఈ వ్యవస్థ పునరుద్ధరణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి మరో వారం పది రోజులు కొనసాగితే గ్రామాలు కంపుకొడతాయని ఆయా గ్రామాలవారు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించగా.. నేడు చెత్త సేకరణ వ్యవస్థ కుప్పకూలమేంటటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు వెంటనే చర్యలు చేపట్టి బిల్లులు విడుదల చేసి తిరిగి గ్రామాల్లో చెత్త సేకరణ వ్యవస్థ పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏడాదికి పైగా అందని బిల్లులు
సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత 2024 ఫిబ్రవరి నుంచి పంచాయతీ కార్యదర్శులు పూర్తిస్థాయిలో అన్ని పనులు చేపడుతూ వచ్చారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు రాకపోయినా తమ సొంత డబ్బులతో పని చేయించారు. గ్రామాల్లో చెత్త సేకరణ వ్యవస్థ సజావుగా నడిచేందుకు ట్రాక్టర్లకు డీజిల్ పోయించి కొనసాగించారు. ఇతర చిన్నచిన్న పనులు కూడా చేయించగా.. వారికి రావాల్సిన బిల్లులు ఇప్పటికీ అందలేదు.
గత సంవత్సరం వేసవి కంటే ముందుగానే గ్రామ సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో వేసవిలో మంచినీటి సమస్య పరిష్కారానికి సంబంధించి కాలిపోయిన బోరు మోటార్లు బాగు చేయించడం, పైప్‌లైన్ లీకేజీల మరమ్మతు పనులు చేయించారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి డబ్బులు వస్తాయని అధికారులు చెప్పడంతో పనులు చేయించి, ఎంబీ రికార్డులు పూర్తయినా ఏడాదికాలంగా తమకు డబ్బులు రాలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు.
ఒక్కో గ్రామపంచాయతీలో రూ.50వేలకు పైగానే ఖర్చు చేసినా నేటికీ డబ్బులు రాలేదన్నారు. ప్రతి నెల చెత్త సేకరణ, మొక్కలకు నీరు పోసేందుకు ఉపయోగించడానికి ట్రాక్టర్‌కు డీజిల్, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. పాలకవర్గాలు లేక కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, దీంతో ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు.