బంట్వారం/కోట్పల్లి, ఏప్రిల్ 4 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో పచ్చదనంతో పరిఢవిల్లిన పల్లెప్రకృతివనాలు అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ కొరవడి ఎండిపోతున్నాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనం కోట్పల్లి మండలం, ఒగ్లపూర్ గ్రామంలోని పల్లెప్రకృతి వనమే. ఇక్కడి పల్లెప్రకృతివనం, నర్సరీలో సుమారు 2000 వరకు మొక్కలున్నాయి.
కేసీఆర్ హయాం లో ప్రతినెలా వచ్చిన నిధులతో మొక్కల పెంపకానికి అప్పటి సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెప్రకృతివనం నిర్వహణను అధికారులు పట్టించు కోకపోవడంతో అందులోని మొక్కలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
కాగా పల్లెప్రకృతివనం, నర్సరీకి సొంతంగా బోరుతోపాటు విద్యుత్తు కనెక్షన్ లేకపోవడంతో అందులోని మొక్కలకు నీటిని అందించేందుకు క్వారీ గుంతే దిక్కు. ఆ క్వారీ నుంచి నీటిని తోడేందుకు మోటరుకు విద్యుత్తు కనెక్షన్ పక్కన ఉన్న కంకర మిషన్ కంపెనీ నుంచి తీసుకునేవారు. అయితే ఆ కంపెనీ మూత పడడంతో ప్రస్తుతం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పల్లెప్రకృతి వనంలోని మొక్కలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.