తాండూరు, డిసెంబర్ 30 : తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లోని అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని భావించిన సీఎం కేసీఆర్ నిధుల వరదను కురిపించడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బాధ్యతతో ఉత్సాహంగా పల్లె ప్రగతిలో భాగస్వాములవుతుండడంతో పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు డంపింగ్‌యార్డుల ఏర్పాటు, గ్రామం ఆహ్లాదంగా, నందనవనంగా కనిపించేందుకు నర్సరీలు, వైకుంఠధామాల ఏర్పాటు తాండూరు నియోజకవర్గంలోని పల్లెల్లో దాదాపుగా పూర్తయింది.
స్వపరిపాలన దిశగా పల్లెలు
పల్లెలు స్వపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాయి. గ్రామాలు ఆదర్శంగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడంతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని 143 గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ ప్రత్యేక కమిటీ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు, ప్రజలతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమాలు నిర్వహించి పల్లెల అభివృద్ధికి పాటు పడ్డారు. దీంతో పాటు ‘పల్లె పల్లె’కు పైలట్ పేరుతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గ్రామాల్లో పర్యటించడంతో అనేక గ్రామాల్లో వేల సంఖ్యల్లో సమస్యలు తీరాయి.

విస్తృతంగా గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు
పల్లె ప్రగతి కార్యాచరణతో ప్రతి పల్లెలో ప్రతి రోజూ పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు చేసి నియంత్రిత పద్ధతిలో విస్తృత భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా నిధులు వినియోగించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గ్రామాల్లో పాడుబడ్డ గృహాలు, బావులతో పాటు జనావాస ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కల్గించే పొదలను, అపరిశుభ్రతను తొలగించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై పనులు చేపట్టడంతో పల్లెలు చక్కగా కనిపిస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు రక్షణ కల్పిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తడి, పొడి చెత్తలను వేరు చేసి డంపింగ్ యార్డులో వేస్తున్నారు. ప్లాస్టిక్‌ను వాడకుండాప్లాస్టిక్పై అవగాహన కల్పిస్తున్నారు. పల్లెలోని ఇంటి గోడలపై ప్రజలను చైతన్య పరిచే సూక్తులను రాయడం కనిపిస్తోంది.
మారుతున్న పల్లెల ముఖచిత్రం..
పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల ముఖచిత్రం మారుతోంది. చరిత్రలో ముందెన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రభుత్వం పల్లెల స్వపరిపాలన, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక పనులు చేపట్టడంతో బీఆర్ఎస్ సర్కార్‌కు జేజేలు పలుకుతున్నారు. కులమత బేధాలు లేకుండా గ్రామాల్లో అందరూ సమన్వయంతో పనులు చేస్తూ పల్లెల ముఖచిత్రం మారుస్తున్నారు. చెత్త సేకరణ, మంచి నీటి సరఫరా కోసం ప్రతి పంచాయతికీ ప్రత్యేక వ్యక్తులను నియమించి వాహనాలు ఇవ్వడంతో ప్రజలకు చాలా మేలు జరుగుతోంది.
పల్లెల ప్రగతికి ప్రత్యేక నిధులు
పల్లె ప్రగతితో గ్రామ ప్రణాళిక కార్యాచరణలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేతలు, అధికారులు, ప్రజల అందరి సమన్వయంతో గ్రామాభివృద్ధి జరుగుతోంది. పల్లెల ప్రగతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి కార్యక్రమాలు చేపట్టడంతో మారుమూల వెనుకబడిన పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి.
– సులోచన, యాలాల సర్పంచ్
పల్లె ప్రగతితో గ్రామాభివృద్ధి
పల్లె ప్రగతితో మా బిజ్వార్ పంచాయతీ పరిధిలోని గ్రామాలు అందరి సహకారంతో నిత్యం పరిశుభ్రత, పచ్చదనంగా కనిపిస్తున్నాయి. పంచాయతీలో తీర్మానం చేసి అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు కలిగే శిథిలావస్థలోని గృహాలతో పాటు వార్డుల్లో అపరిశుభ్రతను పూర్తిగా తొలగించడం జరిగింది. ప్రజలకు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. సీఎం కేసీఆర్‌కు పల్లెల అభివృద్ధికి ప్రణాళికను రూపొందించడంతో గ్రామాలు అభివృద్ధివైపు పరుగెడుతున్నాయి.
– ద్యావరి నరేందర్‌రెడ్డి, బిజ్వార్ సర్పంచ్