న్యూఢిల్లీ, జూలై 6 : నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజున సోమవారం టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సుమారు 4,800 మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో 2.1 శాతం. మైక్రోసాఫ్ట్‌కు చెందిన వాణిజ్య అమ్మకాల వ్యాపారం, ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగంలోనే అత్యధికంగా ఈ ఉద్యోగుల కోత జరిగింది. కంపెనీ షేర్లు అత్యల్ప స్థాయిని నమోదు చేసిన కొన్ని వారాలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. తాజా ఉద్వాసనల విషయాన్ని కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోలెమన్ సిబ్బందికి ఒక మెమోలో ప్రకటించారు. కేవలం ఖర్చులు తగ్గించుకోవడానికి చేపట్టిన చర్య కాదని, ఇది కంపెనీ నిర్వహణలో వస్తున్న విస్తృత మార్పులో భాగంగా చేపట్టినవి అని ఆమె చెప్పారు. ఈరోజు మేము సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నాము.
ఇది మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 2.1%. వేగంగా మారుతున్న పరిశ్రమలో వినియోగదారులకు సేవలు అందించే స్థితిలో మైక్రోసాఫ్ట్‌ను ఉంచే ప్రాధాన్యతలపై మేము మా సిబ్బందిని, పెట్టుబడులను, శక్తిని కేంద్రీకరిస్తున్నాము అని ఆమె మెమోలో పేర్కొన్నారు. కాగా మైక్రోసాఫ్ట్‌కు ఇదేమీ కొత్త విధానం కాదు. తన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూలైలో ఉద్యోగులపై వేటు వేయడం మైక్రోసాఫ్ట్‌కు ఆనవాయితీగా మారింది. నిరుడు మొత్తం 15 వేల మందికి కంపెనీ ఉద్వాసన పలికింది. మొత్తం 2.20 లక్షల మంది ఉద్యోగులలో ఇది 4%. పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కంపెనీ షేర్లు దాదాపు 23% పడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ అమెరికాలోని సుమారు 9 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాలను అందించింది. ఇది అక్కడి ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 7 శాతానికి సమానం. అయితే, కృత్రిమ మేధకు, ఉద్యోగాల కోతకు మధ్య సంబంధం లేదని ఆమె పరోక్షంగా తెలిపారు. ఈరోజు తొలగించిన ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయబోమని స్పష్టం చేశారు.