రంగారెడ్డి జిల్లాలో వేసవి ఆరంభంతోనే వరి పంటలు ఎక్కడికక్కడే ఎండిపోతున్నాయి. సరైన సాగు నీరు లేక, వేసిన పంటలకు నీరందక అనేక గ్రామాల్లో పొలాలు ఎండిపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైతు భరోసా రానప్పటికీ రైతులు అప్పు చేసి మరీ పంటను సాగు చేశారు. కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
వర్షాభావ పరిస్థితులు అనుకూలించక భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీంత గతంలో ఐదెకరాలకు నీరందించే బోరుబావులు సైతం ఎండిపోయి గంటసేపు కూడా నీరుపోయని పరిస్థితి ఏర్పడింది. గతాన్ని నమ్ముకుని ఈసారి కూడా పంటలు సాగుచేసిన రైతులకు నిరాశే మిగులుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 21 మండలాల్లో యాసంగిలో 93 వేల ఎకరాల్లో వరి వేశారు. వరి నాట్లు వేసిన రెండు నెలలల్లోపే పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
– రంగారెడ్డి, మార్చి 4 (నమస్తే తెలంగాణ)
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద పెట్టుబడి సాయం.. కోతలులేని కరెంటు.. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవి. దీంతో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించేవారు. కానీ, ప్రస్తుతం వేసిన రెండు పంటలకు కూడా రైతు బంధు రాక రైతులు అప్పులుచేసి వ్యవసాయాన్ని సాగుచేస్తున్నారు. ఈ యాసంగిలో కూడా రైతు భరోసా రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేకపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో చెక్‌డ్యాం ఎప్పుడూ నీటితో కళకళలాడేది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అనుకూలించక చెక్‌డ్యాం ఎండిపోయింది. దీంతో చెక్‌డ్యాం కింద తవ్విన బావి కూడా ఎండిపోయింది. చెక్‌డ్యాం, బావి రెండు ఎండిపోవటంతో నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. పంట పొలాలు ఎండిపోతుండటంతో ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు ఉన్నారు. రైతు భరోసా వస్తుందని భావించి నమ్మకంతో వరిపంటలు సాగుచేశారు. రైతు భరోసా రాకపోవటంతో అప్పులు అప్పుగానే మిగిలిపోతున్నాయి.