ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని అన్నదాతలు పేర్కొంటుండగా.. అధికారులు మాత్రం 95 ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు ప్రతిపాదనలు తయారుచేశారు. పంటలు తీవ్రంగా నష్టపోయిన అనేక మండలాలు పంటనష్టం జాబితాలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అలాగే, వికారాబాద్ జిల్లాలో 505 ఎకరాల్లో..పంటలకు నష్టం జరుగగా.. అందులో పత్తి 147 ఎకరాలు, వరి 97 ఎకరాలు, మొక్కజొన్న 111 ఎకరాలు, ఉద్యానవన పంటలు 150 ఎకరాలున్నాయని అధికారులు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. అయితే ఇప్పటివరకూ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం అందకపోవడంతో వారు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ
వికారాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అధిక సంఖ్యలో ఆయా పంటలకు నష్టం వాటిల్లింది. ఎక్కువగా ధారూరు, పూడూరు, పరిగి, దోమ, తాం డూరు, వికారాబాద్ మండలాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. నష్టపోయిన పంటల్లో ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయలున్నాయి. కాగా, పత్తి పంట లో 87 మంది రైతులకు సంబంధించిన 147 ఎకరాలు, మొక్కజొన్న 49 మందివి 111 ఎకరాలు, వరి పంటకు సంబంధించి 38 మంది రైతులకు చెందిన 97 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పసుపుతోపాటు కూరగాయలు 150 ఎకరాల్లో ఉద్యానవన పంటలను రైతులు నష్టపోయారు.
పత్తి పంటకు సంబంధించి పరిగి మండలంలోని యబాజిగూడలో 80 ఎకరా లు, నారాయణపూర్‌లో 10, తాండూరు మం డలంలోని వీరశెట్టిపల్లిలో 26, దోమ మండలంలోని గోడుగోనిపల్లిలో 20, బాసుపల్లిలో 1.20 ఎకరాలు, దొంగఎన్కెపల్లిలో 10 ఎకరా ల్లో నష్టం జరిగింది. అలాగే, వరి పంట ధారూరు మం డలంలోని గురుదొట్లలో 20 ఎకరాలు, తాండూరు మండలంలోని వీరశెట్టిపల్లిలో 22, దోమ మండలంలోని గోడుగోనిపల్లిలో 35, మోత్కూరులో 10, దొంగన్కెపల్లిలో 10 ఎకరాల్లో నష్టం జరిగింది. మొక్కజొన్నకు సంబంధించి పరిగి మండలంలో ని యాబాజిగూడలో 70 ఎకరాలు, నారాయణపూర్‌లో 30, నాగులపల్లిలో 1.20 ఎకరాలు, పూడూరు మండలంలోని మంచన్‌పల్లిలో 10 ఎకరాల్లో నష్టం జరిగిం ది.
జిల్లాలో సుమారు 150 ఎకరాల్లో ఉద్యానవన పంటలు, పసుపు 50 ఎకరాల్లో నష్టపోగా, 100 ఎకరాల్లో ఆయా కూరగాయాల పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యానవన పంటల్లో అధికంగా ధారూరు, పరిగి, దోమ, పూడూరు, వికారాబాద్ మండలాల్లో నష్టం జరిగింది. ధారూరు మండలంలోని రాజాపూ ర్, మోమిన్‌కలాన్, తరిగోపుల, అంతారం గ్రామాల్లో పత్తి, పసుపు పంట వరద నీటికి కొట్టుకుపోవడంతో తమను ఆదుకోవాలని అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. పరిగి, దోమ, తాండూరు, వికారాబాద్, పూడూరు, దుద్యాల, కొడంగల్, చౌడాపూర్, కులకచర్ల మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో రైతులు పంటలను నష్టపోయారు.
ఇంకా అందని పరిహారం..
కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో పది రోజులపాటు ఎడ తెరపి లేకుండా కురిసన వానలకు నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి, కంది, జొన్న, పెసర, మినుము వంటి పంటలకు నష్టం జరిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెలక నేలల్లో వర్షాల ప్రభావం అంతగా లేదని, సాగు చేసిన పంటలు ఆశించిన మేరలో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా దౌల్తాబాద్ మండలంలోని గుముడాల రైతులకు దౌల్తాబాద్ చెరువు నిండి చెరువు వెనుక ప్రాంతంలోని పంట పొలాల్లో నీరు మోకాళ్ల లోతు వరకు చేరి పంట దెబ్బ తీసే ప్రమాదం ఉన్నదని రైతులు పేర్కొంటున్నారు. పంట నష్టంపై వ్యవసాయాధికారి ఏడీఏ శంకర్రాథోడ్ను వివరణ కోరగా నియోజకవర్గంలో 30 శాతం లోపు ఉండొచ్చునని పేర్కొన్నారు.
-వరి పొలంలో మోకాళ్ల లోతు వరకు నిలిచిన చెరువు నీళ్లు
పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం
పరిగి : గత నెలలో పరిగి డివిజన్ పరిధిలో కురిసిన భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పరిగి మండలంలోని పోల్కంపల్లి, యాబాజీగూడ, నర్సయ్యగూడ, చిట్యాల్, రాపోల్, సయ్యద్‌పల్లి, పరిగి, నారాయణపూర్, చిగురాల్‌పల్లి, తొండపల్లి తదితర గ్రామాల్లో 407 ఎకరాలకు పైగా పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు నష్టం జరిగిందని అధికారులు చెబుతుండగా ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. పూడూరు మండలంలోని ఈసీవాగు సమీపంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం చేకూరింది. మంచన్‌పల్లి, కంకల్, అంగడిచిట్టెంపల్లి, ఇతర గ్రామాల్లో 100 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందని రైతులు పేర్కొంటున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
-పూడూరు : అంగడిచిట్టెంపల్లిలో దిగబడుతున్న పొలం
కొట్టుకుపోయిన పత్తిపంట
తాండూరు : తాండూరు సెగ్మెంట్లోని తాండూరు, యాలాల, బషీ రాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలో ఇటీవల కురిసిన వానలకు పలు పంటలకు నష్టం జరిగింది. ఇక్కడ పత్తి, కంది సాగు ఎక్కువగా ఉండడంతో పత్తి పంటకు ఎక్కువ నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. పత్తి పంట కొట్టుకుపోయింది. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
145 ఎకరాల్లో నష్టం
వికారాబాద్ : గత నెలలో కురిసిన వర్షాలకు నియోజకవర్గంలోని పలు మం డలాల్లో పంటలు నీట మునిగాయి. నష్టపోయిన రైతుల పొలాలను వ్యవసాయాధికారులు సందర్శించి నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తున్నారు. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వికారాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి, కంది, మొక్కొజొన్న, కూరగాయల పంటలు నీట మునిగి పాడైపోయాయి. అధికారుల అంచనా ప్రకారం.. 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగింది. మండలంలో 154 మంది రైతులకు 145 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ధారూరు మండలంలో పత్తి, కంది, మొక్కజొన్న, కూరగాయల పంటలు నీట మునిగి పాడైపోయాయి. నవాబుపేట మండలంలో దాదాపుగా 50 ఎకరాలకు పైగా ఆయా రకాల పంటలకు నష్టం జరిగింది.
వికారాబాద్ : వర్షానికి పాడైన కూరగాయల పంట
పంట నష్టంపై పొంతనలేని ప్రతిపాదనలు
రంగారెడ్డి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వర్షాకాలంలో 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 1.20 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. వర్షాలతో పత్తిలో నీరు నిలవడంతో తీవ్ర నష్టం జరిగింది. కొందుర్గు, కేశంపేట, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, యాచా రం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో పత్తి పం టకు తీవ్ర నష్టం జరిగింది. అలాగే, వరి పంట కూ వర్షం నష్టాన్ని కలిగించింది. నష్టపోయిన పంటలను గుర్తించి వెంటనే పరిహారం ఇప్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
పంటనష్టం 95 ఎకరాల్లోనే..
అయితే అధికారులు మాత్రం 95 ఎకరాల్లోనే పంటనష్టం జరిగినట్లు ప్రతిపాదనలు తయారుచేశారు. పంటలు తీవ్రంగా నష్టపోయిన అనేక మండలాలు పంటనష్టంలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందుర్గు మండలంలో మాత్రమే పంట నష్టం జరిగిందని లెక్కలు వేశారు. పంటనష్టం తీవ్రంగా జరిగిన మాడ్గుల, కేశంపేట, తల కొండపల్లి, ఆమనగల్లు, యాచారం మండలాల్లో పంట నష్టం లేదని అధికారులు ధ్రువీకరించడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
కూరగాయల తోటలకూ..
జిల్లాలోని పలు మండలాల్లో కూరగాయల తోటలకూ తీవ్ర నష్టం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మహేశ్వరం, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ మండలాల్లో వేసిన కూరగాయల తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కూరగాయ పంటల నష్టాన్ని కూడా అధికారులు గుర్తించడంలేదని రైతులు ఆరోపణలొస్తున్నాయి.