ఆర్కేపురం, నవంబర్ 6 : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని, అలా కాకుండా పేద ప్రజల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపించి కూల్చివేయడం చాలా దారుణమని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేయబోయే పాదయాత్ర నల్లగొండ నుంచి కాకుండా హైదరాబాద్లోని మూసీ పక్క నుంచి చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరై 54 మంది లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాల్లో సీఎం పాదయాత్ర చేస్తే బాధితుల కష్టాలు తెలుస్తాయని, కూల్చివేతలు ఇక్కడ జరిపి.. పాదయాత్ర అక్కడ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. ఆడబిడ్డకు ఆసరా ఉంటుందనే ఉద్దేశంతోనే అప్పటి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారన్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 11నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.