షాబాద్, సెప్టెంబర్ 5: షాబాద్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి నాగగూడ ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువు, చందనవెళ్లి పెద్ద చెరువు, గోపిగడ్డ, మాచన్‌పల్లి తదితర గ్రామాల చెరువులు అలుగు పారుతున్నాయి. అదే విధంగా మండలంలోని బొబ్బిలిగామ, చర్లగూడ, ఏట్ల ఎర్రవల్లి, కుమ్మరిగూడ తదితర గ్రామాల్లో వాగులు ప్రవహించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు.
షాద్‌నగర్‌లో ముసురు
షాద్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 5: షాద్‌నగర్‌లో ముసురుతో కూడిన వర్షం కురిసింది. షాద్‌నగర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్‌గా పిలువబడే బొబ్బిలి చెరువు వర్షపు నీటితో నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటితో చెరువు పూర్తిగా నిండిపోయి మంగళవారం అలుగు పారింది. పూర్తిస్థాయిలో చెరువు నిండి నాగులపల్లి వాగు మీదుగా లింగారెడ్డిగూడ చెరువులోకి వర్షపు నీరు చేరుతున్నది. చెరువులోని చేపలు దిగువ ప్రాంతానికి వెళ్లకుండా మత్స్యకారులు అలుగు పారుతున్న చోట వలను ఏర్పాటు చేసి చేపలను పట్టారు. నిండిన చెరువును చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చెరువు పూర్తిగా నిండిపోవడంతో చెరువ వద్దకు వచ్చే వారు జాగ్రత్తలను పాటించాలని సంబంధిత అధికారులు, పోలీసులు సూచించారు.
కడ్తాల్ : మండలంలో కురుస్తున్న వానలతో కడ్తాల్, రావిచేడ్, చల్లంపల్లి, సాలార్‌పూర్, మక్తమాదారం, ఏక్వాయిపల్లి, చరికొండ, ముద్విన్, మైసిగండి, గోవిందాయిపల్లి గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మండల కేంద్రంలోని గుర్లకుంట చెరువు అలుగు పారుతున్నది. రైతన్నలు ఆనందపడుతున్నారు.
భారీ వర్షంతో నిండిన చెరువులు
కేశంపేట : కేశంపేట మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వస్తున్న నీటితో చెరువులు నిండాయి. మండలంలోని అల్వాల, పాటిగడ్డ, కేశంపేట, లేమామిడి, కాకునూరు, తొమ్మిదిరేకుల, లింగంధన గ్రామాల మీదుగా ఉన్న పెద్ద వాగు సాగుతోంది. వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు నిండి అలుగులు పారుతున్నాయి. కొండారెడ్డిపల్లిలోని నోటిఫైడ్ చెరువైన పెద్దచెరువు నిండి అలుగు పారుతుండటంతో గ్రామస్తులు మంగళవారం అలుగు వద్ద పూజలు నిర్వహించారు. చౌలపల్లి కేశంపేటలోని అమ్మచెరువు, శ్రీవేంకటేశ్వర చెరువులో నిండుగా నీరు చేరి జలకళ సంతరించుకున్నాయి. చెరువుల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మంగళవారం 8.7 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
రెండు రోజులుగా మండలంలో వర్షం
మంచాల : వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు లేక వివిధ పంటలు ఎండు ముఖం పట్టిన పంటలకు ఈ వర్షం ప్రాణం పోసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది.
చేవెళ్లరూరల్: సోమవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి చేవెళ్ల మండల పరిధిలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవరంపల్లి వాగు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఉధృతితో పొంగి పొర్లుతున్నది. పారుతున్న వాగును తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.
యాచారం :ఉదయం తెల్లవారుజాము నుంచి మధ్యా హ్నం వరకు వర్షం కురిసింది. వర్షపు నీటితో రోడ్లు జలమయమయ్యాయి. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలకు లాభదాయకంగా మారిందని రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండలా చెరువులు
ఆమనగల్లు : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆమనగల్లు పట్టణంలోని సురసముద్రం చెరువు నిండుకుండలా మారింది. మండలంలోని మేడిగడ్డ తండాలోని కత్వవాగు నిండి అలుగు పారుతుంది. వీటితో పాటు కొన్ని కుంటలు, చెరువుల్లోకి నీరు చేరింది.
చేవెళ్లటౌన్ : వివిధ గ్రామాల్లోని వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. సమీప ప్రాంతాల్లోని బోరుబావుల్లో నీటి మట్టం పెరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి కురిసిన వర్షానికి 48.6 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
ఉప్పొంగిన ఈసీ
మొయినాబాద్ : హిమాయత్‌సాగర్ జలాశయానికి వెళ్లే ఈసీ నది వర్షాలకు ఉప్పొంగి పొర్లి ప్రవహించింది. వాగు ఎగువ ప్రాంతాల్లో జోరు వానలు ఉండటంతో ఈసీ వాగులోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
పొంగి పొర్లుతున్న మూసీ
శంకర్పల్లి : ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
40 మిల్లీమీటర్లుగా నమోదు
కొత్తూరు : కొత్తూరులో జోరు వాన కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. 12 గంటల్లో 40 మిల్లీమీటర్లుగా నమోదైంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 13 మి.మీ వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో పంటలకు ప్రాణం వచ్చినైట్లెంది.
మాసబ్ చెరువుకు జలకల
తుర్కయాంజాల్ : మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్ చెరువు పూర్తి స్థాయిలో నిండి జలకలను సంతరించుకుంది. స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువులో తవ్వకాలు చేపట్టి మట్టిని తొలగించడం, కాలువలలో సైతం చెత్తను తొలగించడంతోనే చెరువులోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.