రంగారెడ్డి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) ; ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా నేటికీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయలేదు. దీంతో పంటల బీమా అమలుపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. బీమా అమలైతే నష్టపోయిన పంటలకు పరిహారం అందేది. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులకు నిరాశే మిగులుతున్నది. గత యాసంగి నుంచి ప్రస్తుత వానకాల సీజన్ సైతం రైతులకు కలిసి రాకపోవడంతో రైతాంగం కుదేలు అవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ‘పేరు గొప్ప..ఊరు దిబ్బలా’ మారింది. రైతుల కోసం ఎంతో చేస్తున్నామన్న వారి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. రైతులను ఆదుకునేందుకు అనేక స్కీంలను తీసుకొస్తున్నామని చెబుతున్నా.. ఆచరణకు వచ్చేసరికి ఉత్తుత్తిగానే ఉంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న ఫసల్ బీమా యోజన పథకం పరిస్థితీ అలాగే ఉన్నది. వానకాలం సాగు చేసే పంటలకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బీమా పథకం వర్తిస్తుంది. గతంలో ఈ స్కీమ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95 శాతం, మిగిలిన 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించేవారు. కొన్ని సమస్యలు ఎదురవడంతో ఉపయోగం లేదని ఈ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేండ్ల కిందట నిలిపివేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం బీమా పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. బీమా ప్రీమియాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌తో వానకాల సీజన్ ముగియనున్నది. కానీ..ప్రభుత్వం నేటికీ ఫసల్ బీమాకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయకపోవడంపై రైతాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.
1,100 ఎకరాల్లో పంటలకు నష్టం ..
ప్రస్తుత వానకాలంలో జిల్లావ్యాప్తంగా 3.96 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేస్తారని అంచనా ఉండగా.. ఇప్పటివరకు 2.51 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ అధికారులు పంటల సాగు వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. పంటల బీమాకు సైతం ఈ వివరాలే ప్రామాణికం. బీమా అమల్లో పంట విత్తుకునే సమయంలోనే ప్రీమియం చెల్లించాలి. పంట నష్టం జరిగినప్పుడు ఒక్కో పంటకు ఒక్కో విధానం ఉంటుంది. పరిహారం చెల్లింపులోనూ గ్రామం, మండలం యూనిట్‌గా తీసుకుని పంటల సాగును, దెబ్బతిన్న విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
అయితే ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయకపోవడంతో వానకాలంలో దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం అందకుండా పోయింది. ఇటీవల కురిసిన వానలకు జిల్లాలో 1,100 ఎకరాలకు పైగా నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా పత్తి, ఆ తర్వాత వరి పంటలకు నష్టం కలిగింది. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించగా..ఆ సాయం ఏ మూలకు సరిపోదన్న విమర్శలున్నాయి. ఫసల్ బీమా పథకం అమలై ఉంటే పరిహారం అంది రైతులకు సాంత్వన కలిగేదన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు ఉంటాయని ముందే తెలిసినప్పటికీ..ప్రభుత్వం బీమాను అమలు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాసంగి నుంచి కలిసి రాని సేద్యం ..
గత యాసంగిలో నెలకొన్న కరెంటు కోతలు, అనావృష్టి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వానకాలంలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకుందామంటే నిరాశే ఎదురైంది. తీరా..పంటలు చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతుల ఆరుగాలం శ్రమను నీటిపాలు చేశాయి. వానకాలం పంటల సాగుకు సంబంధించి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఎటువంటి సాయాన్ని అందించలేదు. దీంతో రైతాంగం పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది మందికి రుణమాఫీ కాకపోవడం..కొత్తగా రుణాలు అందకపోవడంతో రైతు లు ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం..అన్నట్లుగా వ్యవసాయ శాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో గత యాసంగి నుంచి కలిసి రాక ఆర్థికంగా చితికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.