వికారాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లాలో 59.46 శాతం ఉత్తీర్ణత వచ్చింది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంతో వెనుకబడగా, వచ్చిన ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. జిల్లావ్యాప్తంగా 32 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించారు. జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లోనూ, మోడల్ స్కూళ్లలోనూ 80 శాతానికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షా ఫీజు చెల్లింపునకు ఈనెల 26 వరకు గడువు విధించారు.
జిల్లాలో 59.46 శాతం ఉత్తీర్ణత..
పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 59.46 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా 13,399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 7,967 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో 6,759 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 3,643 మంది బాలురు ఉత్తీర్ణులుకాగా, బాలికలకు సంబంధించి 6,640 మంది పరీక్షలకు హాజరు కాగా 4,334 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 65.12 శాతం మంది ఉత్తీర్ణులుకాగా, 53.9 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు.
మండలాల వారీగా సాధించిన ఉత్తీర్ణతకు సంబంధించి, చౌడాపూర్ మండలంలో 83.25 శాతం, యాలాల మండలంలో 52.04 శాతం, తాండూరు మండలంలో 71.48 శాతం, మోమిన్‌పేట మండలంలో 47.42 శాతం, పెద్దేముల్ మండలంలో 44.25 శాతం, పూడూరు మండలంలో 65.62 శాతం, ధారూరు మండలంలో 41.78 శాతం, బొంరాస్‌పేట మండలంలో 69.63 శాతం, కులకచర్ల మండలంలో 51.40 శాతం, కొడంగల్ మండలంలో 63.14 శాతం, వికారాబాద్ మండలంలో 72.44 శాతం, దోమ మండలంలో 47.77 శాతం, పరిగి మండలంలో 73.87 శాతం, నవాబుపేట మండలంలో 49.50 శాతం, కోట్‌పల్లి మండలంలో 49.02 శాతం, బంట్వారం మండలంలో 46.40 శాతం, దౌల్తాబాద్ మండలంలో 43.31 శాతం, బషీరాబాద్ మండలంలో 39.69 శాతం, మర్పల్లి మండలంలో 21.61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.