రంగారెడ్డి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సైన్స్ జిజ్ఞాసను పెంపొందించేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్‌పై రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలు ఆసక్తి చూపడం లేదు. జూలై 1 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 15తో ముగిసింది. అయితే పాఠశాలల నుంచి ఆశించిన స్థాయిలో నామినేషన్లు రాకపోవడంతో గడువును అక్టోబర్ 15కు పెంచారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో పాఠశాలల నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరించాయి. ఉత్తమ ప్రదర్శనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతోపాటు స్టార్టప్‌గా అవతరించే అవకాశం ఉన్నప్పటికీ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించకపోవడం.. విద్యాశాఖ ప్రత్యేక చొరవ చూపకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టార్టప్‌లుగా అవతరించే చాన్స్..
కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ఇన్స్పైర్ మనక్’ పేరిట ఏటా అవార్డులను అందజేస్తున్నాయి. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు అభ్యసించే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ఉన్నత పాఠశాలల నుంచి ఐదు చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మూడు చొప్పున నామినేషన్లను స్వీకరిస్తారు. పోటీల్లో పాల్గొనే పాఠశాలలు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన విద్యార్థి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు రూ.10వేల చొప్పున పారితోషికం అందిస్తారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపిస్తారు. అక్కడ ప్రతిభ చాటితే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తుంది. ఈ స్థాయి ప్రాజెక్టులకు ప్రభుత్వం పేటెంట్ హక్కులను కల్పిస్తున్నది. జాతీయ స్థాయి పోటీలో రాణిస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రిని సైతం కలవొచ్చు. ప్రాజెక్టులకు వాస్తవిక రూపాన్నిచ్చి స్టార్టప్‌లుగా రూపొందించేందుకు సైతం ప్రోత్సాహం అందుతున్నది.
చాలా పాఠశాలల నుంచి ఎంట్రీలే రాలే..
ప్రతి సంవత్సరం ఇన్‌స్పైర్‌ను నిర్వహిస్తుండగా.. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి నామినేషన్లు పేలవంగా వచ్చాయి. చాలా పాఠశాలల నుంచి ఎంట్రీలే రాలేదు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికే ఈ కార్యక్రమంలో నామినేషన్లను వేసేందుకు ముందుకు రాకపోవడం అందరినీ విస్మయం గొలుపుతున్నది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఇన్‌స్పైర్‌కు నామినేషన్లను సమర్పించడంలో నిర్లక్ష్యాన్ని కనబర్చాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లు, కస్తూర్బా, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలలు కలిపి మొత్తం 1,201 పాఠశాలలు ఎస్సీఈఆర్టీలో నమోదై ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి పాఠశాలకు 5 చొప్పున మొత్తం 6,005 నామినేషన్లు రావాల్సి ఉంది.
కానీ.. ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లు కేవలం 1,722 మాత్రమే. ప్రైవేటు హైస్కూళ్లు జిల్లాలో 850 వరకు ఉండగా.. కేవలం 42 పాఠశాలలు మాత్రమే ఇన్‌స్పైర్‌కు నామినేషన్ వేశాయి. వినూత్న ఆలోచనలతో రాణిస్తున్న పాఠశాలల విద్యార్థులు జిల్లాలో చాలా మంది ఉన్నారు. గతంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనల్లోనూ ఎంతో మంది ప్రతిభను కనబర్చారు. ఈ ఏడాది సైతం జపాన్ వంటి దేశాల్లో నిర్వహించే ప్రదర్శనలకు జిల్లా నుంచి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ఇన్స్పైర్ మనక్‌లో విద్యార్థులను భాగస్వామ్యులను చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చొరవ చూపక పోవడం విమర్శలకు తావిస్తున్నది.