సిటీబ్యూరో/ఖైరతాబాద్, సుల్తాన్‌బజార్: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ న్యూస్ లెటర్ ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు సాయిరాం వెల్లడించారు. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని, ఓపీ సేవలు మాత్రం ఒక్కరోజు నిలిపివేస్తున్నామన్నారు. కాగా, బెంగాల్లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. శుక్రవారం గాంధీ దవాఖానలో జూడాలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
వారికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, కార్యదర్శి డాక్టర్ అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నిమ్స్‌లోనూ రెసిడెంట్ వైద్యుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు 48 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఓపీ సేవలతో పాటు శస్త్రచికిత్సలను నిలిపివేశారు. సుమారు 400 మందికిపైగా వైద్య సిబ్బంది తమ విధులను బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. 34 విభాగాలకు చెందిన వైద్య, ఇతర సిబ్బంది సేవలను బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి ఉస్మానియా దవాఖాన వరకు జూడాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. భారీ ర్యాలీ నిర్వహించారు.