మొయినాబాద్, నవంబర్ 21 : చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మొయినాబాద్ (Moinabad) మండల పరిధిలోని కనకామామిడి గేటు సమీపంలో గల ఎల్లో దాబా వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఇద్దరు మృతి చెందగా, రెండు కార్లలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం స్థానికంగా మరోసారి కలకలం రేపింది.
శుక్రవారం ఉదయం తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడు మరో ముగ్గురితో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్తున్నారు. అదే సమయంలో ఓ ప్రోగ్రామ్ షూట్ చేయడానికి ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ నలుగురు క్యాబ్లో చేవెళ్లవైపు వెళ్తున్నారు. కనకామామిడి గేటు సమీపంలోని ఎల్లో దాబా వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో క్యాబ్ డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
