జిల్లాలోని ఒకే ఒక్క ప్రాజెక్టు అయిన కోట్‌పల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నా సాగుకు వాడుకోలేని దయనీయ పరిస్థితి నెలకొన్నది. గత 3-4 ఏండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో కోట్‌పల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు మెండుగా ఉన్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడంతో నీరు వృథాగానే ఉండిపోతుంది. 50 ఏండ్ల క్రితం నిర్మించిన కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తిగా దెబ్బతినడం, తూములు కొట్టుకుపోవడం, బ్రిడ్జిలు కూలిపోవడంతో ఈ ప్రాజెక్టులో నీరున్నా ఆయకట్టుకు సాగు నీరందించని పరిస్థితి ఉన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులివ్వడంతో అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అధికారులు అందజేసిన అనంతరం నిధులు విడుదల దశలో ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకీకరణ ఊసే లేకపోవడం గమనార్హం. స్థానిక ప్రజల ఒత్తిడితో అంచనాలను రూపొందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు నిధులు మంజూరు చేయించలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటికే ఐదుసార్లు అంచనాలను రూపొందించి అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయినప్పటికీ నిధుల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఈ యాసంగికి కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు ఇవ్వడం కష్టమేనని సంబంధిత అధికారులు తేల్చిచెబుతున్నారు. జిల్లా రైతాంగానికి సాగునీరిచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు లేకపోవడంతోనే నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందంటూ రైతులు విమర్శిస్తున్నారు.
– వికారాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)
కాలువలు పాడైనయ్..
జిల్లాలో ప్రాజెక్టులు, ప్రధాన చెరువుల నుంచి వెళ్లే కాలువలు పూర్తిగా పాడై సాగు నీరందించే పరిస్థితి లేకపోవడంతో సాగు నీరందించలేకపోతున్నారు. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్‌పల్లి ప్రాజెక్టుకు గత రెండు, మూడేండ్లుగా భారీగా వరద వస్తుండడంతోపాటు సంబంధిత ప్రాజెక్టు కింద ఉండే కాలువలన్నీ కొట్టుకుపోవడంతో కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు నీరందిస్తున్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ద్వారా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని 18 గ్రామాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, కాల్వలు పూర్తిగా దెబ్బతినడం, తూములు కొట్టుకుపోవడంతో కేవలం 2-3 గ్రామాలకు మాత్రమే సాగునీరందిస్తున్నారు.
ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా రుద్రారం, గట్టేపల్లి గ్రామాలకు, కుడి కాలువ ద్వారా ఒక్క గ్రామానికి కూడా సాగు నీరందడం లేదు. తూములు, కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో ఈ యాసంగికి సాగు నీరందించడం కష్టమేనని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. 1.57 టీఎంసీల సామర్థ్యం గల కోట్‌పల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా కాలువలు పూర్తిగా కొట్టుకుపోవడం, దెబ్బతినడంతో రైతులకు నష్టం జరగకూడదనే లక్ష్యంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గత ప్రభుత్వం వెంటనే జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్‌తోపాటు అధికారుల బృందాన్ని పంపి ఏయే పనులు చేపట్టాలనే సమగ్ర నివేదికను అందజేయాలని సూచించడంతోపాటు తదనంతరం కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చింది.
అయితే రూ.110 కోట్ల నిధులతో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణతోపాటు ఆనకట్ట బలోపేతం, కుడి, ఎడమ, బేబీ కాలువల పునర్నిర్మాణం, కాలువల పునర్నిర్మాణం, పాత బ్రిడ్జిల స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మించడం తదితర పనులు చేపట్టేందుకు అంచనాలను తయారు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. తదనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నది. మరోవైపు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేలు కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతు పనులకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కోట్‌పల్లి ప్రాజెక్టు ద్వారా 9200 ఎకరాలకు(కుడి కాలువ ద్వారా 8100 ఎకరాలు, ఎడమ, బేబీ కాలువ ద్వారా 1100 ఎకరాలకు) సాగు నీరందించే సామర్థ్యం ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులు పూర్తైతే 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందించే అవకాశాలు ఉన్నట్లు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టును కుడి కాలువ కింద ధారూరు మండలంలోని నాగసముందర్, అల్లాపూర్, రుద్రారం, బూర్గుగడ్డ, గట్టేపల్లి గ్రామాలు ఉండగా, ఎడమ కాలువ కింద పెద్దేముల్ మండలంలోని మాన్సాన్పల్లి, బుద్దారం, పెద్దేముల్, మారెపల్లి, దుగ్గాపూర్, రుక్మాపూర్, కొండాపూర్, ఖానాపూర్, రేగొండి, మదవంతాపూర్, జనగాం, మంబాపూర్, తింసాన్‌పల్లి గ్రామాలు ఉన్నాయి. బేబి కాలువ కింద నాగసముందర్, బూర్గుగడ్డ గ్రామాల ఆయకట్టుకు సాగునీరందించేలా నిర్మించారు.