రంగారెడ్డి, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ ? అనేది పాత సామెత.. అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత.. ప్రస్తుతం జిల్లాలో ఇదే తీరున అక్రమార్కుల భూ దందా సాగుతున్నది. జిల్లాలో ప్రభుత్వ భూ ఆక్రమణల పర్వం జోరుగా సాగుతున్నది. అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు స్పందించడం లేదు.
ఆ తర్వాత మిన్నకుండిపోతుండడం షరా మామూలైంది. ఇటీవల జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ శశాంక భూ ఆక్రమణలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెవెన్యూ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ అధికారుల తీరుపై సీరియస్ అయినట్లు తెలిసింది. ఇకపై కఠినంగా వ్యవహరించాలని, సైన్ బోర్డులు ఏర్పాటు చేసి సెంటు ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో మారుమూల ప్రాంతంలోనూ వంద గజాల స్థలం రూ.20లక్షల నుంచి రూ.కోట్లలో ధర పలుకుతున్నది. రేట్లు ఆకాశన్నంటడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు.. అసైన్డ్, భూదాన్, పొరంబోకు, అటవీ.. భూముల్లో కబ్జా కాండను సాగిస్తున్నారు. అధికారుల ఉదాసీనత కారణంగా ఇప్పటికే రూ.కోట్ల విలువైన ఎన్నో భూములు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుంటున్నాయి.
మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, హయత్‌నగర్, శేరిలింగంపల్లి, శంషాబాద్, గోపన్‌పల్లి తదితర ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్ తరహాలోనే ఆక్రమణలు ఉంటున్నాయి.
ఇతర ప్రాంతాల్లోనూ ఇదే బాగోతం. చాలా చోట్ల వీటి వెనుక కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారుల అండదండలతో భూ దందా నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన చోట్ల జీపీ పర్మిషన్లతో అక్రమ తంతును సాగిస్తున్నారు. పాత దస్తావేజులు ఉంటే చాలు అడ్డదారిన విద్యుత్తు మీటర్లు, ఇంటి నంబర్లు తెచ్చుకుని రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఈ భూముల్లో రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలుస్తున్నాయి. లే అవుట్లకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను సైతం చెర పడుతున్నారు.
మాడ్గుల మండలం గిరి కొత్తపల్లిరంగ సముద్రం చెరువు, కందుకూరు డివిజన్ పరిధిలోని చందన చెరువు ఆక్రమణలపై, బాలాపూర్ మండలం కుర్మల్ గూడలో ప్రభుత్వ భూముల కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ శశాంక జిల్లాలో జరుగుతున్న భూ దందాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలో జరుగుతున్న భూ ఆక్రమణలపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది.
ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో నిర్లిప్తత ప్రదర్శించడంపై బాలాపూర్ తహసీల్దార్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల పర్యవేక్షణ నిరంతరాయంగా జరగాలని, కబ్జాదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. విలువైన భూములు ఉన్న చోట అవసరమైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఎంతటివారు ఉన్నప్పటికీ ఉపేక్షించవద్దని, ఇకపై ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగితే..రెవెన్యూ అధికారులనే బాధ్యలను చేస్తానంటూ హెచ్చరించినట్లు సమాచారం.
జీవో 59 కింద ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించి జారీ చేసిన పట్టాల్లో జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 2023 ఆగస్టు 17 నుంచి జారీ చేసిన జీవో 59 పట్టాలకు సంబంధించిన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులు ఇవ్వవద్దంటూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను సీసీఎల్ఏ ఆంతర్గత ఆదేశాలను జారీ చేసింది.
బడా నేతలతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు సైతం విలువైన ప్రభుత్వ భూముల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి రూ.కోట్ల విలువజేసే భూములను సొంతం చేసుకున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజాగ తీసుకున్న ఈ నిర్ణయం అక్రమార్కుల్లో గుబులు రేపుతున్నది.