ఆమనగల్లు, ఆగస్టు 7 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ శశాంక విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి సమీపంలో అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం కోనాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ( అమ్మ ఆదర్శ పాఠశాల)ను ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీగా ఉందని గ్రహించి ఎందుకు నియమించలేదని సీడీపీవోను ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వంటశాలలో విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు, ఈఈ పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు, జిల్లా శిశు సంక్షేమ అధికారి పద్మజారమణ, వ్యవసాయ ఏడీఏ సుజాత, తహసీల్దార్ లలిత, సీడీపీవో శాంతిరేఖ, ఎంపీడీవో కుసుమ మాధురి, మండల విద్యాధికారి సర్దార్ నాయక్ , ఏవో అరుణకుమారి పాల్లొన్నారు.
వినతుల వెల్లువ..
ఆమనగల్లు మండలంలో పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ శశాంకకు పలువురు వినతిపత్రాలు అందజేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పట్టణంలోని వసతి గృహం ఎత్తివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్టాండ్ ఉన్నత పాఠశాల కూలిపోయే స్థితిలో ఉందని వెంటనే మరమ్మతులు చేయించాలని విన్నవించారు. గత ప్రభుత్వం ఆమనగల్లు మండలానికి డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకోవడానికి మంజూరు చేసిన భవనాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దళిత మహిళను పోలీస్స్టేషన్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పూర్తిగా విధుల నుంచి బహిష్కరించాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు.