రంగారెడ్డి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిటీలో భూములు కొల్పోతున్న రైతులతో బుధవారం భూసేకరణ అథారిటీ వద్ద హైడ్రామా నెలకొన్నది. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా పలువురు రైతుల పట్టా భూములను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసింది. తమ భూములను ఇవ్వబోమని తెగేసి చెప్పినా రైతులకు తెలియకుండానే.. ఆ భూములకు సంబంధించిన పరిహారాన్ని అథారిటీలో జమ చేయడంతోపాటు.. వారి భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో బాధిత రైతులు కొంతకాలంగా తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిరసనలు, ఆందోళనలూ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని భూసేకరణ అథారిటీ బాధిత రైతులకు నోటీసులు జారీచేసింది. ‘భూసేకరణలో భాగంగా మీ భూములను తీసుకుంటున్నామని.. వాటికి సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికే అథారిటీలో జమ చేసిందని.. అయినా మీ భూములను ఫార్మాసిటీకి ఇచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారో ఆ విషయాన్ని స్వయంగా హాజరై తెలపాలని’ ఆ నోటీసుల్లో పేర్కొన్నది. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, పలు గిరిజన తండాలకు చెందిన రైతులు పండుగ పూట అయినా నాంపల్లిలోని భూసేకరణ అథారిటీ వద్దకు ఉదయం 10:00 వరకు చేరుకున్నారు. తీరా న్యాయమూర్తి సెలవులో ఉన్నట్లు వారికి తెలిసింది. దసరా పండుగ పూట సెలవులు ఉంటాయని తెలిసి కూడా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యమా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫార్మాసిటీలో పట్టా భూములను కోల్పోతున్న రైతులకు తాము అండగా ఉంటామని ప్రకటించిన కోదండరెడ్డి, కోదండరాంలను ఇటీవల బాధిత రైతులు కలిశారు. తమ భూములను ఫార్మాకు ఇవ్వనందుకు నాంపల్లిలోని భూసేకరణ అథారిటీ నుంచి నోటీసులు వచ్చాయని.. ఈ నెల 1న భూసేకరణ అథారిటీ వద్దకు రావాలని ఇరువురిని బాధిత రైతులు అభ్యర్థించగా తప్పనిసరిగా వస్తామని చెప్పారు. కోదండరాం వచ్చి రైతులకు సంఘీభావం ప్రకటించగా.. కోదండరెడ్డి రాకుండా మొహం చాటేయడంపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. కోదండరాం మాట్లాడుతూ.. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా, కోదండరెడ్డి కోసం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించి.. ఆయన రాకపోవడంతో వెనుదిరిగారు. గత ఎన్నికలకు ముందు కోదండరెడ్డి పట్టా భూములు కోల్పోతున్న రైతులకు తిరిగి వారి భూములను వారికే ఇప్పిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడేమో పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫార్మాసిటీ పేరుతో యాచారం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు రెండువేలకు పైగా ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం ఏకపక్షంగా రైతు ల పేర్లను తొలగించి, ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. ఆ జాబితా నుంచి తొలగించి రైతుల పేర్లను ఆన్లైన్లో చేర్పించాలని కొంత కాలంగా పోరాడుతున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, మల్రెడ్డి రంగారెడ్డి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల భూములను వారికే ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడేమో పట్టించుకోవడమేలేదు. పట్టా భూములున్న రైతులను అధికారులు బెదిరిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. పట్టా భూముల్లో బలవంతంగా వేస్తున్న కంచెను అడ్డుకునేందుకు వెళ్తున్న రైతులను అరెస్టు చేసి ఠాణాలకు తరలిస్తున్నారు.