పెద్దఅంబర్‌పేట, ఆగస్టు 20 : పెద్దఅంబర్‌పేట మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్నపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం పురపాలక సంఘంలో చర్చనీయాంశంగా మారింది. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోరుతూ 17 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసులను అదనపు కలెక్టర్‌కు అందజేసిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. మెజారిటీ సభ్యుల సంతకాలతో అధికారులకు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వడంతో ఇక తొలగింపు పక్కా అని ఓ వర్గం కౌన్సిలర్లు ధీమాగా ఉన్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ అవిశ్వాసం లేకుండా స్వచ్ఛందంగా చెవుల స్వప్నతో రాజీనామా చేయించి, కొత్తగా పండుగల జయశ్రీకి చైర్పర్సన్ పదవి అప్పగించాలనే ప్రయత్నాలూ కొనసాగుతున్నాయి. అయితే, చైర్పర్సన్ స్వప్న.. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు మంగళవారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసినట్టు తెలుస్తున్నది.
అవిశ్వాసానికి అవకాశం ఇవ్వొద్దని కోరినట్టు సమాచారం. ఆయన మాత్రం పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడాలని సూచించినట్టు తెలుస్తున్నది. అనంతరం కౌన్సిలర్లతోపాటు మున్సిపాలిటీకి చెందిన పార్టీ పెద్దలు పెద్దఅంబర్‌పేటలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్ల మధ్య వాడివేడిగానే చర్చలు జరిగినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్‌పర్సన్‌ను ఆ పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తే పార్టీ పటిష్టత దెబ్బతింటుందని సీనియర్ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాజీనామా విషయంపై ఒక్కరోజులో తేల్చుకోవాలని స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. దీనిపై బుధవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. మున్సిపల్ కౌన్సిల్ గడువు జనవరి 25వ తేదీతో ముగియనున్నది. ఆ తర్వాత పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసి చివరి ఐదునెలలైనా తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని పలువురు కౌన్సిలర్లు గట్టిగానే కోరినట్టు సమాచారం. ఏదిఏమైనా అవిశ్వాసమా..? రాజీనామానా? అనే విషయంపై బుధవారం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని, వస్తే ఆ ప్రక్రియను మొదలు పెడతామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.