వికారాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా, మూడో విడతకు సంబంధించి చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాత్రి వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్యూలో నిల్చున్న దృష్ట్యా శనివారం మధ్యాహ్నంలోగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యయనే దానిపై స్పష్టత రానున్నది. జిల్లాలోని 594 గ్రామ పంచాయతీలు, 5058 వార్డులకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో తాండూరు, కొడంగల్ సెగ్మెంట్లలోని 262 గ్రామ పంచాయతీలు, 2,198 వార్డులకు.. రెండో విడతలో వికారాబాద్ సెగ్మెంట్లోని 175 పంచాయతీలు, 1,520 వార్డులకు.. మూడో విడతలో పరిగి సెగ్మెంట్లోని 157 పంచాయతీలు, 1,340 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఇప్పటికే మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా, మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ మరో రెండు రోజుల్లో ముగియనున్నది. మొదటి విడతలో 223 పంచాయతీలకు 683 నామినేషన్లు, 1,527 వార్డులకు 3,953 నామినేషన్లు దాఖలుకాగా, రెండో విడతలో 175 పంచాయతీలకు 794, 1,520 వార్డులకు 3,337 నామినేషన్లు, మూడో విడత లో గురువారం వరకు 157 పంచాయతీలకు 247 నామినేషన్లు, 1,340 వార్డులకు 979 నామినేషన్లు దాఖలయ్యాయి.
పంచాయతీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, ఈనెల 17న మూడో విడత పోలింగ్ జరుగనున్నది. పలు గ్రామ పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవమైన దృష్ట్యా జిల్లాలోని 557 గ్రామ పంచాయతీలు, 4,406 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. బుజ్జగింపులు, బేరసారాలు మొదలయ్యాయి.
బ్యాలెట్ విధానంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా రు. ఇప్పటికే జిల్లాకు సరిపడా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నిం గ్ అధికారుల నియామకంతోపాటు పీవో, ఏపీవో, ఇతర పీవో అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతి మండలం లోనూ 20శాతం అదనంగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయడంతోపాటు పోలింగ్ సిబ్బందిని నియమించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 165 స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు, 165 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు 594 మందిని ఎన్నికల అధికారులు నియమించారు.
జిల్లాలోని తాండూరు, కొడంగల్ సెగ్మెంట్లలోని పలు గ్రామ పంచాయతీ (జీ పీ)లు, వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తాండూరు సెగ్మెంట్లో 24 జీపీలు, కొడంగల్ సెగ్మెంట్లో 13 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. తాండూరు మండలంలో ఐదు, బషీరాబాద్‌లో ఐదు, యాలాలలో తొమ్మిది, పెద్దేముల్లో ఐదు, కొడంగల్‌లో ఒకటి, దౌల్తాబాద్‌లో మూడు, బొంరాస్‌పేటలో ఏడు, దుద్యాల మండలంలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
రంగారెడ్డి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మూడోవిడత నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఇబ్రహీంపట్నం, మం చాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో జరుగనున్న ఎన్నికలకు చివరి రోజు అభ్యర్థులు అధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, షాద్‌నగర్, చేవెళ్ల సెగ్మెంట్లలో ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారం ఊపందుకున్నది. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నామినేషన్లు పూర్తి కావడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. బుజ్జగింపులు, బేరసారాలు అధికంగా సాగుతున్నాయి.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 6,98,472 మంది ఓటర్లు.. పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 6,98,472 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6,98,472 మంది ఓటర్లలో పురుషులు 3,43,668 మంది, మహిళా ఓటర్లు 3,54,788,ఇతరులు 16 మంది ఉన్నారు.
