Toilet | తుర్కయంజాల్, మార్చి 7 : తుర్కయంజాల్ మున్సిపాలిటి చౌరస్తాలో ప్రజా మురుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం మున్సిపాలిటీకి వచ్చే వారు కనీసం మూత్రవిసర్జన చేయాలన్నా అక్కడ మూత్రశాలలు కానీ, మరుగుదొడ్లు కానీ అందుబాటులో లేవు. దీంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా తుర్కయంజాల్ చౌరస్తాలో మరుగుదొడ్ల అవసరం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఏర్పాటు చేయడం లేదు. స్వచ్ఛ భారత్ మార్గదర్శకాల ప్రకారం మున్సిపాలిటీలో ప్రతి వెయ్యి జానాభాకు ఒక మరుగుదొడ్డి అందుబాటులో ఉండాల్సి ఉండగా నిత్యం వేల మంది తిరిగే తుర్కయంజాల్ ప్రధాన చౌరస్తాలోనే మరుగుదొడ్డి అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
వివిధ పనుల నిమిత్తం నిత్యం వేలాది మంది మున్సిపాలిటీకి వస్తుంటారు. మున్సిపాలిటీలో సరిపడా సదుపాయాలు లేక స్థానికులతో పాటుగా ఇతర ప్రాంతాల వారు సైతం నానా అవస్ధలు ఎదుర్కోంటున్నారు. ఆదివారం రోజున తుర్కయంజాల్ చౌరస్తాలో వారాంతపు సంత జరుగుతుంది. అయితే వారాంతపు సంతకి వేల సంఖ్యలో వచ్చే ప్రజలు మరుగుదొడ్డి లేక నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటి అధికారులు ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకోని మరుగుదొడ్డితో పాటు మూత్రశాలల వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తుర్కయంజాల్ చౌరస్తాలో మరుగుదొడ్డి, మూత్రశాల అందుబాటులో లేక మహిళలు, పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం తుర్కయంజాల్కు వస్తుంటారు. అయితే ప్రజలకు మరుగుదొడ్డి, మూత్రశాలలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ముఖ్యంగా మహిళలు పడే భాద వర్ణనాతీతం. మున్సిపాలిటి అధికారులు వెంటనే స్పందించి తుర్కయంజాల్ మున్సిపాలిటి చౌరస్తాలో మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాలి అని మేతరి అశోక్ డిమాండ్ చేశారు.