వికారాబాద్, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. వికారాబాద్ మున్సిపల్‌తోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలు, వార్డుల్లో కొన్ని రేషన్‌షాపుల్లో సన్న బియ్యం లేక లబ్ధిదారులు వెనుదిరిగిపోతున్నారు. సన్న బియ్యం పథకం ప్రారంభించిన ఒక రోజు, రెండు రోజులకే బియ్యం అయిపోయాయి అని రేషన్ డీలర్లు సమాధానం చెబుతున్నారు. రేషన్ షాపులకు రావాల్సిన బియ్యం మొత్తం రాకుండా సగం వరకు అందించడంతో త్వరగా బియ్యం అయిపోయి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో షాపునకు దాదాపు 45 నుంచి 50 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా.. 20 క్వింటాళ్లు రావడంతో లబ్ధిదారులకు సన్న బియ్యం పథకం అందడంలేదు. రెండు, మూడు రోజులు బియ్యం పంపిణీ చేసి ఆతర్వాత షాపులను మూసివేస్తున్నారు. అదనపు కోటా కోసం సంబంధిత అధికారులకు సమాచారం అందించినా ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో సన్నబియ్యం పథకం పూర్తిగా నీరుగారుతున్నదని ప్రజలు మండిపడుతున్నారు.