రంగారెడ్డి, జూలై 22(నమస్తే తెలంగాణ) : రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలంతా ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ.. బ్యాంకులకు వచ్చిన జాబితాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించే అర్హులను నిర్ధారించినట్లు తెలుస్తున్నది. రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరినీ కలిపి ఒకే కుటుంబంగా పరిగణించడం.. పీఎం కిసాన్ నిబంధనలను రుణమాఫీకి కూడా పాటించడంతో జిల్లా రైతాంగం వాపోతున్నది. ఒక్కరి పేరుపై బాకీ ఉన్నా మాఫీ కాలేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 34వేల వరకు ఉన్నారు.
అయితే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో కేవలం 11,700 మంది రైతుల పేర్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన 22 వేల మంది రైతులకు మొండిచెయ్యి చూపినట్లేనా? అన్న భావన రైతుల్లో కలుగుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతులందరికీ రూ.2లక్షలు రుణమాఫీ చేయాలని, భార్యాభర్తలిద్దరినే కుటుంబ సభ్యులుగా పరిగణించాలని, వేరుగా ఉంటున్న కుమారులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. కొద్దిమందికే మాఫీ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చిన రైతులకు సైతం కొంతమందికి వారివారి ఖాతాల్లో మాఫీ డబ్బులు పడలేదు. రంగారెడ్డి జిల్లాలో 49,741 మంది రైతులకు రూ.278.06కోట్ల రుణమాఫీని చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయా జాబితాలను బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులకు పంపారు. అయితే జాబితాలో పేర్లు చూసుకుని బ్యాంకులకు వెళ్లిన వారికి సైతం నిరాశే ఎదురవుతున్నది. రూ.లక్ష లోపు రుణమాఫీ ప్రక్రియ మొదలై మూడు, నాలుగు రోజులు అవుతున్నప్పటికీ రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాకపోవడంపై బాధిత రైతులు ఆందోళనలో ఉన్నారు.
ఇప్పటివరకు 48,239 మంది రైతులకు సంబంధించి రూ.250 కోట్ల మేరనే రైతుల ఖాతాల్లో జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా.. 1500ల మంది రైతులకు పైగా ఖాతాల్లో మాఫీ డబ్బులు జమ కావాల్సి ఉన్నది. ఇంకెప్పుడు వస్తాయని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.