బడంగ్పేట్, ఏప్రిల్ 1 : కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక దాడులు, హత్యలను నివారించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ మహిళలపై దాడులు జరుగుతుంటే ఇక రక్షణ ఎక్కడ ఉందని ఆమె మండిపడ్డారు.
నాగర్కర్నూల్లో జరిగిన ఘటన మరువకముందే మరో మహిళ కామాంధుల కర్కశత్వానికి బలైందన్నారు. హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున ఒక విదేశీ మహిళపై లైంగికదాడి జరిగితే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రేవంత్ చేతగాని పాలనతోనే రాష్ట్రంలో మహిళలపై హింస పెరిగిందని ఆమె విమర్శించారు.
రేవంత్రెడ్డి మహిళలను కోటీశ్వరులుగా మార్చడం కాదు.. ముందు వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. జర్మనీ యువతిపై లైంగిక దాడి చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు కన్నీళ్లు తప్పా ఏమీ మిగలలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆమె పేర్కొన్నారు.