పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 13 : పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్‌పై అదే పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంతో బలం నిరూపించుకున్నారు. చైర్పర్సన్ చెవుల స్వప్న తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. శుక్రవారం మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారం వార్డు కార్యాలయంలో ఆర్డీవో అనంతరెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా బలపరీక్ష నిర్వహించారు. క్యాంపులకు తరలివెళ్లిన కౌన్సిలర్లు ఉదయం 10.30 గంటలకు నేరుగా సమావేశ మందిరానికి చేరుకున్నారు. సమావేశంలో చైర్పర్సన్ స్వప్నపై అవిశ్వాసం కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టగా.. 17 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు తెలిపారు. కోరం సరిపడా ఉండడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు అనంతరెడ్డి వెల్లడించారు. సమావేశానికి సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్త చైర్పర్సన్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. అది ఎప్పుడు అనేది పైనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. అప్పటివరకు ఇన్చార్జి చైర్‌పర్సన్‌గా వైస్ చైర్పర్సన్ వ్యవహరిస్తారని చెప్పారు.
ఏడుగురు గైర్హాజరు..
మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. వీరిలో 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉండగా, నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీజేపీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. గతనెల కాంగ్రెస్ కౌన్సిలర్ పండుగల జయశ్రీ ఆధ్వర్యంలో 17 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన పత్రాలను అందజేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్పర్సన్ స్వప్నపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా బలపరీక్ష కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి 17 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డితోపాటు మొత్తం ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేదు. కోరం ఉండడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. హాజరైన అందరూ మద్దతు తెలుపడంతో నెగ్గినట్టు ప్రకటించారు. దీంతో నాలుగున్నరేండ్లు నడుస్తున్న అవిశ్వాస తీర్మాన ప్రక్రియకు ఫుల్స్టాప్ పడినట్టయింది. కొత్త చైర్‌పర్సన్‌గా పండుగల జయశ్రీ ఎన్నిక ఇక లాంఛనమే కానున్నది. మున్సిపాలిటీలో సమస్యలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కొత్త చైర్పర్సన్ ఎన్నికను త్వరగా చేపట్టాలని కౌన్సిలర్లు కోరారు.