యాచారం, జూలై19 : మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు ఉదయం సాయంత్రం వేళల్లో సకాలంలో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు నిత్యం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులలో నిత్యం నరకం చవిచూస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఫుట్ బోర్డులో వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సమస్యలు మరింత రెట్టింపు అయ్యాయి. ఉదయం పూట ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు, పూలు, పాలు, పండ్ల వ్యాపారులు, రోజువారి కూలీలు ప్రతిరోజు ఉదయం పూట ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. సాయంత్రం పూట తమ పనులు ముగించుకొని తిరిగి మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటారు. దీంతో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో చిక్కిరిసిన బస్సులలోనే తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు పుట్ బోర్డు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పలు గ్రామాలకు చెందిన స్వచ్ఛంద కార్యకర్తలు విద్యార్థి సంఘాల నాయకులు ఎన్నోమార్లు ఆర్టీసీ అధికారులకు బస్సుల సంఖ్యను పెంచాలని విన్నవించుకున్నప్పటికీ వారి బాధలు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అధికారుల నిర్లక్ష్యంతో అప్పుడప్పుడు ఫుట్ బోర్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తు జారీ కిందపడి గాయాల పాలవుతున్నారు. రెండు రోజుల క్రితమే అయ్యవారి కూడా గ్రామానికి చెందిన ఓ మహిళ ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి తీవ్ర గాయాల పాలయ్యింది. అయినప్పటికీ ఆర్టీసీ అధికారుల్లో ప్రజాప్రతినిధుల్లో కాశింతైన చలనం లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు ప్రజలు ప్రయాణికులు విద్యార్థులు పడుతున్నా అవస్థలను గుర్తించి గ్రామీణ ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం పూట సరిపడా బస్సులను నడపాలని కోరుతున్నారు. లేదంటే రోడ్డు ఎక్కి ఆందోళన చేయాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.