Anganwadi Centre | కేశంపేట, జూన్ 21 : మారుమూల పల్లెల్లోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేసే అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు పోషణమాసం పేరుతో ప్రచార ఆర్భాటం చేశారే కానీ చిన్నారులకు నాలుగు అక్షరాలు నేర్పించేందుకు అంగన్వాడీ కార్యకర్తను నియమించలేకపోయారని పాలకులు, అధికారుల తీరుపట్ల మండిపడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం, ఆరోగ్యం, విద్య అందుతుందని ప్రకటనలు గుప్పించడం కాదని, ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు టీచర్లను నియమించి చిన్నారుల విద్యా ప్రగతికి బాటలు వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కేశంపేట మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గత రెండేళ్లుగా టీచర్ లేదని, దీంతో ఆయానే అంగన్వాడీ కేంద్రాన్ని నెట్టుకొస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన అంగన్వాడీ కార్యకర్త శ్రీదేవికి సూపర్వైజర్గా ప్రమోషన్ రావడంతో మహేశ్వరం వెళ్లారని, అప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీనే ఉందన్నారు. గత రెండేళ్లుగా చింతకుంటపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి టీచర్ లేదనే విషయం అధికారులకు తెలిసినా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా ఆయానే కేంద్రాన్ని నెట్టుకొస్తుందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని, ఖాళీ స్థానాన్ని భర్తీ చేసే ఉద్దేశ్యం లేనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో వాలంటీర్లను నియమించినట్లు అంగన్వాడీ కేంద్రానికి ఓ టీచర్ను నియమిస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.
తగ్గిన విద్యార్థుల సంఖ్య..
చింతకుంటపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి గతంలో 30 మందికిపైగా విద్యార్థులు వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. విద్యా బుద్దులు నేర్పించేందుకు అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో ఆ సంఖ్య క్రమంగా 15మంది చిన్నారులకు పడిపోయినట్లు తెలిపారు. చిన్నారులకు విద్య పరమైన బోధన జరగకపోవడంతో తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి పంపించేందుకు ఆసక్తి చూపడం లేదని, చేసేది లేక అప్పులు చేసి ప్రైవేటుకు పంపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ చేయకున్నా టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసిన వారిచేత అంగన్వాడీ కేంద్రంలో బోధన కొనసాగిస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.
పిల్లలకు చదువు చెప్పేవారు లేరు
మా పిల్లలను అంగన్వాడీకి పంపిస్తే అక్కడ నాలుగు అక్షరాలు నేర్పించేందుకు ఎవరు లేరు. రెండేళ్లుగా కొత్త టీచర్ వస్తుందని ఎదరు చూస్తూనే ఉన్నా ఎలాంటి ఫలితంలేదు. ఆయా ఒక్కతే అంగన్వాడీ కేంద్రాన్ని నెట్టుకొస్తుంది. టీచర్ లేకపోతే పిల్లలకు చదువు ఎవరు చెబుతారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి అంగన్వాడీ టీచర్ను నియమిస్తే బాగుంటుంది.
– జిన్నారం స్వప్న, చింతకుంటపల్లి
పాడైన పదార్థాలు వస్తున్నాయి..
అంగన్వాడీ కేంద్రానికి పాడైన పదార్థాలు ఇస్తుండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం. అంగన్వాడీ కేంద్రంలో తీసుకున్న గుడ్లను ఉడకబెట్టి చూస్తే అందులో సోనా మాత్రమే కనబడుతుంది. ఇలాంటి గుడ్లను పిల్లలకు పెడితే ఆరోగ్యం పాడవదా? పౌష్టికాహారం అందజేస్తున్నామని చెబుతున్న పాలకులు అంగన్వాడీలకు వస్తున్న పదార్థాలను తినిపిస్తే ఆ బాధ అర్థమవుతుంది. పిల్లలకు పెట్టే పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.
– పల్లెమోని సంపత్, చింతకుంటపల్లి