Hotels | పెద్దఅంబర్‌పేట, ఏప్రిల్ 1 : పేరంటే ఎవరైనా పెడతారు. కానీ, అది అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం మాత్రం తక్కువ మందే చేస్తారు. ‘అరె.. బాగుందే’ అని పదిమంది అనుకుంటేనే పేరొచ్చినట్లు. ఇదంతా దేనికోసమని అనుకుంటున్నారా? ..ఇదంతా పేర్ల కోసమే. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లు భిన్నమైన పేర్లతో ఆకర్శిస్తున్నాయి. మార్కెట్ దృష్టిని కట్టిపడేస్తున్నాయి. ఆహారప్రియుల మదిని దోస్తున్నాయి.
పేరంటే ఇట్లుండాలె అని అభినందించేలా చేస్తున్నాయి. రుచి చూడకముందే వీరి అభిరుచి బాగుందే అనేలా చర్చకు తెరలేపుతున్నాయి. జాబ్ వొచ్చినా.. బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నా, పెండ్లి కుదిరినా, గర్ల్‌ఫ్రెండ్ పుట్టినరోజు వచ్చినా, ఇంట్లోని వారు బైక్ కొనిచ్చినా స్నేహితుల నుంచి మొదట వచ్చే మాట ‘మామ.. దావత్ ఎప్పుడు మరి?’ అనేదే. అందుకే దావత్ పేరుతో పలు రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. “దావత్ ఇస్తనంటే ‘దావత్”లకే పోదాం అని మాట్లాడుకునేంతగా ఫేమస్ అవుతున్నా యి. ఇలా ఒక్కటేంటి పదుల సంఖ్యలో విచిత్రమైన, విభిన్నమైన పేర్లతో హోటళ్లు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
Hotels
విభిన్నంగా.. విచిత్రంగా..
హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్ల పేర్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని విభిన్నంగా ఉంటుండగా.. మరి కొన్ని విచిత్రంగా ఉంటూ గుర్తుండిపోతున్నాయి. నగరంలోని ఓ ప్రాంతంలో ‘9 అమ్మ’ పేరిట రెస్టారెంట్ వెలిసింది. నానమ్మను జ్ఞప్తికి తెచ్చేలా.. ఆమె చేతి వంట రుచిని గుర్తుకు తెచ్చేలా ఉన్నది ఈ పేరు. నగర శివారులో ఏటీఎం పేరుతో రెస్టారెంట్ ఏర్పాటైంది.. దానికి క్యాప్షన్‌గా ‘ఆపి తిని పో మామా’ అని రాసి ఉన్నది.
ప్రధానంగా యువతను ఆకట్టుకునేలా, భోజనప్రియుల అభిరుచులకు అనుగుణంగా పేర్లను ఎంపిక చేస్తున్నారు హోటళ్ల నిర్వాహకులు. పేరు బాగుంటేనే కదా.. ఆగి తిని రుచి చూసేది అని చెప్తున్నారు మరికొందరు. అందుకే కొత్తగా ఆలోచిస్తున్నామని పేర్కొంటున్నారు. ‘అన్నేసి చూడు..నన్నేసి చూడు’ అంటుందటం ఉప్పు. అందుకేనేమో ‘ఉప్పు కారం’ పేరిట రెస్టారెంట్ ఏర్పాటైంది. తెలుగు వారిని ఆకట్టుకునేందుకు ఎంతోమంది వివిధ పేర్లతో రెస్టారెంట్లను తెరిచారు. తెలుగింటి రుచులు, రాయలసీమ రుచులు, పల్లె రుచులు, రాజుగారి రుచు లు, మా పల్లె వంటకాలు వంటివి ఇప్పటికే వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయి. జిల్లాల రు చుల పేర్లతోనూ ఏర్పాటవుతున్నాయి.
ఏదైనా తిన్న వస్తువు బాగా నచ్చినప్పుడు ‘ఆహా.. రుచి అంటే ఇలా ఉండా లి’ అంటాం. అందుకే రుచి దేవుడెరుగు కానీ, పేరు మాత్రం ఆహా అని వెలిశాయి. రుచి చూడకముందే పేర్లే ఆహా అనిపిస్తున్నాయి. తినేది ఇంకా బాగా నచ్చితే అద్భుతః అంటుంటారు. అద్భుతః పేరుతోనూ రెస్టారెంట్లు ఉన్నాయి. వివాహ భోజనంబు, ఘుమఘుమలు, వియ్యాలవారి విందు, అరిటాకు వంటి పేర్లతోనూ ఇప్పటికే ఎన్నో రెస్టారెంట్లు వెలిశాయి. కొత్తగా కోడికూర, చిట్టిగారె’, గోంగూర, ఉలవచారు, దిబ్బరొట్టి, తాలింపు, బకాసుర, తిన్నంత భోజనం, తినేసి పో, దాతిను, వచ్చి తినిపో, పందెం కోడి, పొట్ట పెంచుదాం, దావత్ ఇలా ఎన్నో పేర్లతో హోటళ్లు ఏర్పాటవుతున్నాయి. భోజన ప్రియుల అభిరుచికి అనుగుణంగా పేర్లు వెలుస్తున్నాయి.
ఫొటోలతో ప్రచారం
విభిన్న, విచిత్రమైన రెస్టారెంట్ల పేర్ల వద్ద భోజనప్రియులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు కూడా ఇష్టపడుతున్నారు. తాము వెళ్లొచ్చిన, చూసిన విభిన్నమైన రెస్టారెంట్ల పేర్లు కనిపించేలా వాటికి ప్రచారకర్తలుగా మారుతున్నారు. వంటింట్లో కనిపించే వస్తువులు, డైనింగ్ టేబుల్‌పై కూర్చుని తినే సమయంలో మాట్లాడుకునే పదాలే ప్రస్తుతం రెస్టారెంట్లు, హోటళ్లకు పేర్లుగా వెలుస్తున్నాయి. నిత్యం ఇంట్లో వాళ్లందరి నాలుకలపై ఆ పదాలు పలుకుతుండటం, అవే పదాలతో హోటళ్లు వెలుస్తుండటంతో జనానికి మరింత దగ్గరవుతున్నాయి. వారిలో కొత్త చర్చకు, ఆనందాన్ని పంచేందుకు వేదికలుగా మారుతున్నాయి. పలువురు నిర్వాహకులు మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా ఉండేలా విభిన్నంగా పేర్లను ఎంపిక చేస్తున్నారు.