వికారాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న గ్రామ, వార్డు సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యా యి. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిం ది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల జాబితాలను ఎంపిక చేసేందుకు నిర్వహించిన గ్రామ, వార్డు సభలు నిరసనలు, నిలదీతల నడుమ ముగిశాయి. గ్రామ సభలకు హాజరైన అధికారులకు ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురిసిం ది. ఈనెల 21 నుంచి శుక్రవారం వరకు ఈ సభలు జరుగగా.. అర్హులైన పేదలను కాదని అనర్హులకే జాబితాల్లో అందలం వేయడం, అర్హులను ఏకపక్షంగా తగ్గించడం వంటి కారణాలతో పల్లెల్లోని గ్రామసభలు ఉద్రిక్తంగా, రణరంగంగా మారాయి. చివరికి పోలీసుల బందోబస్తు మధ్య సభలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
-బంట్వారం(కోట్పల్లి)మండలంలోని బార్వాద్ గ్రామంలో ప్రజలు ఇంది రమ్మ ఇండ్ల విషయమే అధికారులతో వాగ్వావాదానికి దిగారు. గతేడాది నిర్వహించిన ప్రజాపాలన సభల్లోనే 7,314 మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పడు జాబితాలో 4,337 పేర్లను అధికారులు ప్రకటించడంతో మండి పడ్డారు. అర్హులందరికీ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
-వికారాబాద్ మండలంలోని జైదుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో అనసూయ అనే మహిళ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీ లు నెరవేర్చడంలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. మరణించిన వారి పేర్లపై సంక్షేమ పథకాలు ఎలా వస్తాయని గ్రామ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శులను నిలదీశారు.
-తాండూరు మండలంలోని అంతారం గ్రామంలో జరిగిన గ్రామసభలో బీఆర్ఎస్ మద్దతుదారులకు సంక్షేమ పథకాల జాబితాలో ఎందుకు పేర్లు రావడంలేదని బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు.
-సమావేశాలు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం తప్ప సంక్షేమ పథకాలను అందించడంలేదని పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు ప్రజలు అధికారులను నిలదీశారు.
-మంచాల మండలంలోని జాపాల గ్రామంలో జరిగిన గ్రామసభ రసాభాసగా సాగింది. ఇందిరమ్మ ఇండ్ల ఎం పికలో అర్హుల జాబితాను పక్కనపెట్టి కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల పేర్లను జాబితాలో చేర్చి చదవడం ఏమిటని ప్రజలు ప్రశ్నించారు.
-తాండూరు పాత మున్సిపల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వార్డు సభలో గందరగోళం నెలకొన్నది. ఆ సభకు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు ఎవరూ రాక పోవడంతో స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డులకు ప్రజాప్రతినిధులు, అధికా రులు వెళ్లి బీఆర్ఎస్ కౌన్సిలర్ వార్డు సభకు ఎందుకు రారని ప్రశ్నించారు. దీంతో ప్రజలు, కౌన్సిలర్ ఆసిఫ్ బసవన్నకట్ట దగ్గర నిర్వహించిన సభకు ఎమ్మెల్యే హాజరు కావడంతో అక్కడికెళ్లి తమ సమ స్యలను చెబుతామనుకోగానే పోలీసులు చుట్టుముట్టి వెళ్లనివ్వలేదు.
నిరసనలు.. నిలదీతల మధ్య..
జిల్లాలో నాలుగు రోజుల పాటు కొనసాగిన ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు శుక్రవారం ముగిశా యి. గత నాలుగు రోజులుగా జిల్లాలోని పల్లెల్లో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ఉత్కంఠభరితంగా సాగాయి. ఎక్కడ చూసినా నిరసనలు, నిలదీతల మధ్య సభలు హోరెత్తాయి. కొన్ని మండలాల్లో పోలీసుల నిఘాలో కొనసాగాయి. అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించగా.. తమ పేర్లు రాని ప్రజలు అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకుని, నిలదీశారు. అధికారుల సూచనల మేరకు మళ్లీ పథకా లకు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా జిల్లాలో మొత్తం 924 గ్రామ, వార్డు సభలను నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 48,358 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డుల కోసం 1,53,000 మంది ప్రజా పాలన, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోగా, గ్రామ సభల ద్వారా 73,039 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
కొత్తగా వచ్చిన దరఖాస్తులు 96,423..
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాల్లో సగానికిపైగా అర్హులకు అన్యాయం జరుగడంతో పలువురు అధికారులను నిలదీశారు. గత నాలుగు రోజులుగా జరిగిన గ్రామ, వా ర్డు సభల్లో ప్రజలు మళ్లీ భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 24 వరకు అర్హుల నుంచి కొత్తగా 96,423 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీటిలో అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చినవే ఉన్నాయి. కాగా సర్కారు కేవలం 23,000 మందికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి చేతులు దులుపుకొందామనుకోగా ప్రజలు షాకిచ్చారు. లబ్ధిదారుల జాబితాలో కోత విధించడంపై అధికారులను నిలదీయడంతోపాటు ఆగ్ర హం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా అర్హుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో మళ్లీ దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం 58,784 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 26,312 రైతు భరోసా పథకానికి 3745, ఆత్మీయ భరోసా పథకానికి 7582 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల జాబితాలను ఎంపిక చేసేందుకు నిర్వహించిన గ్రామ, వార్డు సభలు నిరసనలు, నిలదీతల నడుమ ముగిశాయి. పై నాలుగు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సర్వే చేపట్టిన సమయంలోనే ప్రజలు సర్వే అధికారులను అడ్డుకోవడం, నిలదీయడంతో మొదలైన నిరసనలు చివరి రోజు వరకూ కొనసాగాయి. అయితే సర్వే సమయంలోనే వ్యతిరేకత రావడాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించింది. ప్రజాపాలన దరఖాస్తులు తప్పని సరేం కాదని ఆ సమయంలో చెప్పిన సర్కారు… ప్రస్తుతం పై నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఆ అప్లికేషన్లకే ప్రాధాన్యమివ్వడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రతి గ్రామంలోనూ ప్రజలు అధికారులను నిలదీశారు. కొత్త రేషన్ కార్డులకు వేలాది మంది అర్హులు దరఖాస్తు చేసుకోగా.. ప్రస్తుతం అవి కనిపించడంలేదని చెబుతుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. కాగా ఆయా పథకాల కు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని ఎప్పుడు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో అధికారులు ఏదో ఒక సమాధానం చెప్పి గ్రామసభలను ముగించారు.