అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి. జిల్లాలో తొమ్మిది చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నీటితో నిండి ఉన్నా.. ఒక్క ఎకరానికీ సాగు నీరందని దుస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని అన్నదాతలు మండిపడుతున్నారు. కాగా 1.57 టీఎంసీల సామర్థ్యంగల కోట్పల్లి ప్రాజెక్టులో ప్రతిఏటా నీటి నిల్వలు సరిపడా ఉన్నా ఆ ప్రాజెక్టు కాల్వలు పూర్తిగా దెబ్బతినడం, తూములు కొట్టుకుపోవడం, బ్రిడ్జిలు కూలిపోవడంతో దాని కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి నెలకొన్నది.
– వికారాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)
ఒక్క ఎకరాకూ అందని సాగునీరు..
జిల్లాలోని తొమ్మిది చిన్న, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన తూ ములు, కాల్వలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు పూడికతీత పనులు చేపట్టకపోవడం తో వాటిలో సమృద్ధిగా నీరున్నా రైతులు తమ పొలాలకు నీటిని వాడుకోలేక పోతు న్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో కోట్పల్లి ప్రాజెక్టుకు ఒక్కసారి కూడా నవీకరణ పనులు చేపట్టలేదు. జిల్లాకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్వహణను కూడా గాలికి వది లేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్పల్లి ప్రాజెక్టుకు గత రెండు, మూడేండ్లుగా భారీగా వరద వస్తున్నది. అయితే, ప్రాజెక్టు కింద ఉన్న కాల్వలన్నీ కొ ట్టుకుపోవడంతో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందడం లేదు. ఈ ప్రాజెక్టు ద్వా రా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని 18 గ్రామాలకు సాగునీరు అందించా ల్సి ఉన్నది.
యాసంగి పంటల సాగు ప్రారంభమైనా ఇంకా ఆయకట్టు కింద ఉన్న పంటలకు సాగు నీరందించే దిశగా కాంగ్రెస్ ప్రభు త్వం ఆలోచించకపోవడం శోచనీయం. 15 నెలల కాంగ్రెస్ పాలనలో కోట్పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి దాదాపు 10 సార్లు అంచనాలను తయారు చేయడం, మార్పులు చేయడం తప్ప ఇప్పటికీ నయాపైసా విడుదల చేయలేకపోయారు. ఎన్నికలకు ముందు తమను గెలిపిస్తే కోట్పల్లి ప్రాజెక్టు నవీకరణకు కృషి చేస్తామని హామీనిచ్చిన తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేలు ఏడాదిన్నర అవుతున్నా పట్టించుకోవడంలేదని రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. కోట్పల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరుండడంతో నీటిని విడుదల చేస్తారనే ఆశతో పంటలను సాగు చేస్తే ఇప్పు డు విడుదల చేయకపోవడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని వారు కన్నీ రు పెట్టుకుంటున్నారు. సాగుకు వెచ్చించిన పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నదని.. అప్పులను ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని వాపోతున్నారు.
ప్రాజెక్టుల కింద ఆయకట్టు..23,747 ఎకరాలు
జిల్లాలో కోట్పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, సర్పన్పల్లి, నందివాగు, శివసాగర్, అల్లాపూర్, కాక్రవేణి, కొంశెట్టిపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల ద్వారా 23,747 ఎకరాలకు ఆయకట్టు ఉందని జిల్లా నీటిపారుదల శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా 9,200 ఎకరాలు, సర్పన్పల్లి ప్రాజెక్టు కింద 3,285, నందివా గు ప్రాజెక్టు కింద 1,900, జుంటుపల్లి ప్రాజెక్టు కింద 2,082, శివసాగర్ ప్రాజెక్టు కింద 1000, అల్లాపూర్ ప్రాజెక్టు కింద 1,414, కొంశెట్టిపల్లి ప్రాజెక్టు కింద 1,073, కాక్రవేణి ప్రాజెక్టు కింద 1,326, లక్నాపూర్ ప్రాజెక్టు కింద 2,469 ఎకరాల ఆయకట్టు ఉన్నది. అయితే.. వాటి కాల్వలు పూర్తిగా పాడై సాగునీరు అందడం లేదు.
ఆ విషయంలో ప్రభుత్వం, అధికారులు శ్రద్ధ చూపడంలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో సంబంధిత ప్రాజెక్టుల కాల్వలు, తూ ములు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పన్పల్లి, శివసాగర్, లక్నాపూర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగు నీరందించడం ఏమోకాని సంబంధిత ప్రాజెక్టుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సర్పన్పల్లి ప్రాజెక్టును ఆనుకొని వెలిసిన రిసార్ట్స్ల నిర్వాహకులు చెరువులో బోటిం గ్ దందా చేస్తూ చుక్క నీటిని కూడా రైతులకు వదలనివ్వకుం డా అక్రమ వ్యాపారం చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారు.
పంట ఎండిపోతున్నది..
ఎకర నుంచి రెండు ఎకరాల వరకు వరి పంట వేశాం. సాగు నీరు అందక పొట్ట దశలో ఉన్న పంట ఎండిపోతున్నది. కోట్పల్లి ప్రాజెక్టు నుంచి నీరు వచ్చి ఉంటే బాగుండేది. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు వేసి సకాలంలో కోట్పల్లి ప్రాజెక్టు నుంచి నీటిని కొం డాపూర్ చెరువులోకి వదిలితే పంటలు ఎండిపో యే పరిస్థితి రాకుండే. పంటల ఎండిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. -గజ్జల నర్సింహులు, కూర రమేశ్, రేగొండి, పెద్దేముల్
రైతులను పట్టించుకోవడం లేదు..
కొండాపూర్ చెరువులో నీళ్లు లేక సుమారు 70 ఎకరాల వరి పంట ఎండిపోతున్నది. కోట్పల్లి ప్రాజెక్టులో నీరు ఉన్నా వాడుకోలేని దర్భర స్థితి నెలకొన్నది. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. మాది రైతు ప్రభుత్వమని ఉపన్యాసాలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పత్తా లేరు. ఇప్పటికైనా రైతుల గోస విని ఆదుకోవాలి.
-కోనేరు సాయిలు, రైతు, పెద్దేముల్
కాల్వలో పిచ్చిమొక్కలు పెరిగాయి
కోట్పల్లి ప్రాజెక్టులో నీరున్నా పంటలకు అందని పరిస్థితి నెలకొన్నది. నేను రెండు ఎకరాల్లో వరి పంట వేశా. బోరు బావిలో నీరు లేక పంట ఎండిపోయింది. కోట్పల్లి ప్రాజెక్టు కాల్వలు మొత్తం పూడుకుపోయి, పిచ్చి మొక్కలు పెరిగాయి. రైతులంతా కలిసి ప్రధాన కాల్వలో పూడిక తీశాం. కానీ, నా పొలం వరకు కోట్పల్లి ప్రాజెక్టు నీరు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలి.
– పుల్లమోల్ల శ్రీనివాస్, జనగాం గ్రామం
Fff