Health Tips | ఇబ్రహీంపట్నం, మార్చి 15 : మార్చి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు అయ్యిందంటే ప్రజలు ఎండలను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రకృతి సహజసిద్దంగా లభించే కొన్ని రకాల పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకృతిలో సహజసిద్దంగా లభించే కొబ్బరి బొండం, చెరకురసం, వివిధ రకాల పండ్ల రసాలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపశమనంగా ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగానే నీటిశాతం ఎక్కువగా లభించే కీరదోసతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నందున ప్రజలు శీతలపానీయాలపై మొగ్గు చూపకుండా చెరకురసం, నిమ్మరసం, కొబ్బరిబోండాంతో పాటు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటిని తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎండాకాలంలో కొబ్బరిబోండాన్ని అమృత బాండంగా చెప్పుకోవచ్చు. కల్తీలేని కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం పొందాలన్న, అలసట నుంచి తక్షణ శక్తిని పొందాలన్న తప్పనిసరి కొబ్బరినీళ్లు తాగాల్సిందే. మనిషి, అనారోగ్యానికి గురైతే గ్లూకోజ్ ఎక్కిస్తారు. గ్లూకోజ్‌లో ఉండే పోషకాలకంటే అధికంగా కొబ్బరిబోండంలో లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పోషక పదార్థాలతో పాటు మనిషి శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం కొబ్బరి నీళ్లలో ఉంటాయి. కడుపులో అప్పుడప్పుడు వచ్చే మంటలను తగ్గించడానికి టానిక్‌లా పనిచేస్తుంది. మనిషి శరీరంలో లవణాల శాతాన్ని పెంచడానికి కూడా ఈ నీళ్లు ఎంతో ఉపయోగపడుతాయి. కొబ్బరి బోండం కల్తీ చేయడానికి అవకాశంలేదు. కొబ్బరినీళ్లను ఎప్పుడైనా ఎవరైనా తాగవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు. కొబ్బరిబోండంలో సోడియం, పొటాషియం, కాల్షియం, పాస్పరస్, ఐరన్, సల్ఫర్, క్లోరైడ్, ప్రోటీన్స్, ఇతర ఖనిజాలు పుష్కలంగానే ఉంటాయి. పాలలోని ప్రోటీన్ల కంటే అధికశాతం కొబ్బరి నీళ్లో ఎక్కువగా ఉంటాయని శరీరంలో లవణాలశాతం పడిపోయినప్పుడు కొబ్బరినీళ్లు తాగినప్పుడు లవణాల శాతం పెరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. మూత్రపిండాల సమస్య ఉంటే కొంత మేరకు తగ్గించి శరీరానికి చల్లదనం ఇస్తుంది. మార్కెట్లో దొరికే వివిధ రసాయనలతో తయారు చేసిన చల్లని పానియాలకంటే వందరెట్లు ఆరోగ్యం పంచే కొబ్బరిబోండం మేలని అంటున్నారు.
కల్తీలేకుండా స్వచ్చమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటికాగా, రెండోది చెరుకురసం. అనాధిగా వస్తున్న చెరుకు రసాన్ని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు. ప్రధానంగా వేసవిలో దీని విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుతం పల్లె, పట్టణం తేడాలేకుండా చెరుకు రసాన్ని విక్రయిస్తున్నారు. ధర అందుబాటులో ఉండి, ఆరోగ్యాన్ని ఇచ్చే చెరుకు రసంలో పోషకాలు పుష్కలంగాఉన్నాయని, మండుటెండల నుంచి ఉపశమనంపొందేందుకు చెరుకు రసం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యాధికారులు అంటున్నారు. చెరుకురసం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ పెరగడంతో పాటు ఎలాంటి వ్యాదులు దరిచేరవని ప్రతి ఒక్కరుక్రమంగా చెరుకు రసాన్ని తీసుకోవాలి.
మనకు ఎళ్లవేళల అందుబాటులో ఉంటూ..అతితక్కువ ధరకు లభించే వాటిల్లో కీరదోస ఒకటి. ఇది వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోడ్లపక్కన, తోపుడు బండ్లపై లభించటంతో పాటు కూరగాల మార్కెట్లో కూడా కీర దోసకాయలు విరివిగా లభిస్తాయి. కీరదోసను భోజనంలో తీసుకోవడం ద్వార కూడాఎన్నో లాభాలున్నాయని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. కీరదోసతో ఎండ నుండి ఉపశమనం కలిగిస్తుందని కీరను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాదులు దరిచేరవని వైద్యాధికారులుంటున్నారు. కీరదోసతో ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.