Namasthe Telangana | మొయినాబాద్, మార్చి04: నమస్తే తెలంగాణలో ప్రచురితమైన ‘తాగునీరు కలుషితం’ అనే కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. మొయినాబాద్ గ్రామంలోని ఆశీర్ఖాన వెనుక భాగంలో మంచి నీటి బోరు చుట్టూ మురుగునీళ్లు చేరి బోరులోనికి వెళ్లగా.. సురంగల్ గ్రామంలో మంచినీటి పైపులైన్ గేట్ వాల్వ్ లీకేజీ కావడంతో కలుషితమైన మురుగునీళ్లు పైపులైన్లో కలుస్తున్నాయని సోమవారం నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య నిర్వహణ అధికారి సంధ్య వచ్చి ఆయా ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. అనంతరం నివేదికను మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజూద్దీన్కు అందించారు. ఈ క్రమంలో మంగళవారం నాడు మొయినాబాద్, సురంగల్ గ్రామాల్లో మున్సిపల్ కమిషనర్ పర్యటించారు. మంచినీటి బోరు చుట్టూ మురుగునీళ్లు చేరకుండా జాగ్రత్తలు చేపట్టాలని సిబ్బందికి అదేశించారు. సురంగల్ గ్రామంలో లీకేజైన మంచినీటి పైపులైన్ గేట్ వాల్వ్ మరమ్మతు పనులను పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందితో ప్లంబర్‌ను పిలిచి గేట్‌వాల్వ్ మరమ్మతులు చేయించారు. మున్సిపల్ పరిధిలో ఎక్కడా పైపులైన్ లీకేజీలు అవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
వేసవిలో మంచి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజూద్దీన్ అన్నారు. కాబట్టి మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మండల పరిధిలోని పెద్దమంగళారం, మొయినాబాద్, సురంగల్ గ్రామాల్లో మంగళవారం నాడు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. అందులో భాగంగా గ్రామాల్లో ఉండే నర్సరీలను, మంచినీటి నిర్వహణను పరిశీలించారు. నర్సరీలోని మొక్కలు ఎడిపోకుండా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా ఖాజా మొయిజూద్దీన్ మాట్లాడుతూ.. ఎండకాలంలో మంచినీటి సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ప్రజలు వచ్చిన మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఎండలు అధికం కావడంతో భూగర్భ జలాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయని, ఈ నేపథ్యంలో మంచినీటి సమస్య రానుందని తెలిపారు. ప్రజలు తమకు అవసరం ఉన్న వరకు మంచినీటిని తీసుకున్న తరువాత వృథాగా వదిలేయవద్దని సూచించారు. మంచి నీరు వృథాగా వెళ్లకుండా ట్యాప్‌లు బిగించుకోవాలన్నారు. మంచినీటిని వృథా వదిలితే ఆ ఇంటికి నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు ఇంటి నుంచి వచ్చే వ్యర్థ నీటిని మున్సిపల్‌కు సంబంధించిన మురుగు కాలువలలోనికి రాకుండా ప్యాక్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు అందరు సహకరిస్తే గాని ఎండకాలంలో మంచినీటి ఎద్దడిని అధిగమించలేమని పేర్కొన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ సిబ్బంది సోమ శేఖర్, మహేశ్, మాజీ ఉపసర్పంచ్లు గడ్డం అంజిరెడ్డి, యాలాల జైపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు అవుసుల భాస్కరాచారి, తదితరులు పాల్గొన్నారు.