వికారాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఆరు రోజులపాటు జరిగిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డుల్లోనూ మోగిన మైకులు మూగబోయాయి. సోమవారం ప్రచారం చివరి రోజు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటికెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో స్థానికేతరులుంటే ప్రచారం ముగిసిన వెంటనే తమ ప్రాంతాలకు వెళ్లాలని.. కొత్తవారెవరూ మున్సిపాలిటీల్లో ఉండకూడదని ఎన్నికల అధికారులు సూచించారు. ప్రచారం ముగిసిన దృష్ట్యా ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్‌కు ఒక్కరోజే సమయం ఉండడం తో ఓటర్లకు రహస్యంగా డబ్బు పంపిణీ చేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు సిద్ధం అవుతుండగా.. అడ్డుకునేందుకు అధికారులు నిఘా పెట్టారు. నాలుగు మున్సిపాలిటీల్లోని 98 వార్డులకు రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది.
ఆఖరి రోజు జోరుగా ప్రచారం..
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కావడంతో అభ్యర్థుల తరపున ఆయా పార్టీల ముఖ్యనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా అన్ని వార్డుల్లోని గడపగడపకెళ్లి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ విస్తృతంగా ప్రచారం చేశారు. తాండూరు మున్సిపాలిటీలోని 25, 34, 36, 12, 28 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, పరిగి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 3, 13, 14 వార్డుల్లో ప్రచారం చేశారు. మరోవైపు ఎంఐఎం అభ్యర్థుల తరపున ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో ప్రచారంలో పాల్గొన్నా రు. కాంగ్రెస్ తరపున పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్థానిక నేతలే పాల్గొన్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులూ పలు వార్డుల్లో గడపగడపకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకొని తమకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ప్రచారంలో బీఆర్ఎస్ ముందంజ..
పుర పోరు ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోయింది. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఎన్నికల ఇన్చార్జీలు శాసనమండలి పక్షనేత మధుసూదనాచారి, పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, ఎం.ఎన్శ్రీనివాస్ రావు, గట్టు రామచంద్రరావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజూగౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మండలాల అధ్యక్షులు, ముఖ్యనేతలూ ప్రచారం చేశారు. తాండూరు మున్సిపాలిటీలో నిర్వహించిన కేటీఆర్ రోడ్ షోతో జిల్లా బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ పెరిగింది. అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా మున్సిపాలిటీల అభివృద్ధితోపాటు ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని కాంగ్రెస్‌ను రోడ్ షోలో భాగంగా కేటీఆర్ కడిగి పారేశారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులు దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమ లు చేసిన సంక్షేమ పథకాలు, నాలుగు మున్సిపాలిటీల్లోనూ చేసిన అభివృద్ధిని ఇంటింటికీ వివరించారు. దీంతో అన్ని వార్డుల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులకు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.