మొయినాబాద్, జూన్ 17: మంచి నీటి పైపులైన్ మరమ్మతుల విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరమ్మతుల కోసం మూడు నెలల క్రితం గుంతను తవ్వారు కానీ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో రోడ్డుపక్కన గుంత అలాగే ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న రోడ్లను ఆనుకుని మంచి నీటిపైపులు ఇటీవల లీకేజీ అయ్యింది. పైపులైన్ మరమ్మతు చేయడానికి మున్సిపల్ అధికారులు గత మూడు నెలల క్రితం ఒక గుంతను తవ్వారు. కానీ ఇంకా మరమ్మతు పనులు చేపట్టలేదు. పైపులైన్ మరమ్మతు పనులు చేయడంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మూడు నెలలుగా ఆ గుంత అలాగే ఉంది. ప్రస్తుతం ఆ గుంత ప్రమాదకరంగా మారింది. మూల మలుపు వద్దనే గుంత ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ కారణంగా పాఠశాలకు వచ్చిపోయే విద్యార్థులకు ప్రమాదకరంగా మారింది.
గుంత సరిగ్గా మూలమలుపు వద్దే ఉండటంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద వాహనాలు అక్కడి నుంచి వెళ్లడానికి కుదరడం లేదు. మంచి నీటి పైపులైన్ మరమ్మతు చేయకుండా ఎన్ని రోజులు గుంతను అలాగే పెడతారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పైపులైన్ మరమ్మతులు చేసి.. గుంతను పూడ్చివేయాలని గ్రామస్తులు మున్సిపల్ అధికారి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. మూడు నెలలు అవుతున్నా ఇప్పటివరకూ మరమ్మతులు చేయరా అని ప్రశ్నించగా మెల్లగా చేస్తామని సదరు అధికారి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. మున్సిపల్ ఉన్నతాధికారులు గ్రామాలను పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా.. వాళ్లు సైతం గ్రామాలను పర్యవేక్షించడం లేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది