షాద్‌నగర్, ఏప్రిల్ 5 : మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్లమెం ట్ ఎన్నికల్లో మాదిగలకు స్థానం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ మండిపడ్డారు. షాద్‌నగర్ పట్టణ ముఖ్యకూడలిలో శుక్రవారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 పార్లమెంట్ స్థానాల్లో నాలుగు శాతం కూడా లేని రెడ్డీలకు ఆరు సీట్లు, 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు రెండు స్థానాలు కేటాయించి, 12 శాతానికిపైగా ఉన్న మాదిగలకు మాత్రం స్థానమే లేకుండా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ది ప్రజాప్రభుత్వం కాదని, రెడ్ల, మాలల సర్కారు అని ఆరోపించారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సీటును మల్లు రవిని కేటాయించడం అన్యాయమన్నారు. ఆయన సోదరుడు మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. మాదిగలకు సామాజిక న్యాయం దక్కలేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రశాంత్, ఆనంద్, వినోద్, అశోక్, శ్రీనివాస్, మహేందర్, జంగయ్య పాల్గొన్నారు.