మొయినాబాద్, జనవరి 8 : ప్రభుత్వాలు.. ప్రజాప్రతినిధులు మారినా పేదల సంక్షేమానికి పాటుపడాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల రైతువేదికలో 88 మంది లబ్ధిదారులకు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్‌తో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని కొనియాడారు. గత ప్రభుత్వంలో మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మమత, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఎంపీడీవో సంధ్య, ఆర్ఐ చంద్రమోహన్, ఏఈవో సునాల్కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మండలంలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. మూడోరోజైన సోమవారం సాయంత్రం మల్లికార్జునస్వామి ఉత్సవ విగ్రహాలను చిలుకూరు గ్రామంలో హనుమాన్ ఆలయం నుంచి పురవీధుల్లో ఊరేగించారు.
ఈ సందర్భంగా స్వామి వారిని ఎంపీ, చేవెళ్ల ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందించారు. వారిని ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశ్కురుమ సన్మానించారు. కార్యక్రమంలో వెంకటాపూర్ సర్పంచ్ మనోజ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, యువత విభాగం మండలాధ్యక్షుడు పరమేశ్, నాయకులు పాల్గొన్నారు.