రంగారెడ్డి, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగ్ రోడ్డుపై ఆంక్షలను వాహనదారులు గాలికి వదిలేస్తున్నారు. వేగ నియంత్రణపై అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో తారామతిపేట ఎగ్జిట్ నం.10 నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు సుమారు 50 కిలోమీటర్లకు పైగా ఔటర్ రింగ్ రోడ్ విస్తరించి ఉన్నది. ఈ రోడ్డు రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోకి వస్తుంది. ఈ రోడ్డు రావడంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది కానీ రోడ్డు ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఓఆర్ఆర్ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అప్పటి ప్రభుత్వం భావించింది. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని ఆయా వాహనాలకు కేటాయించిన లైన్లలో వాహనాలు నడపాలని, స్పీడ్ లిమిట్స్‌కు అడ్డుకట్ట వేయాలని పలు ప్రాంతాల్లో సీక్రెట్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ రోడ్‌పై వాహనాల ప్రయాణానికి గతంలో పలు ఆంక్షలు విధించారు కానీ క్రమంగా ఆంక్షలు అమలు చేయాల్సిన అధికారులు వాటిని గాలిలోకి వదిలివేయడంతో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. వేగాన్ని నిరోధించడం కోసం ఏర్పాటు చేసిన సీక్రెట్ కెమెరాలు కూడా సరిగా పనిచేయడంలేదు. మరోవైపు పెట్రోలింగ్ పోలీసులు కూడా లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
కనిపించని పెట్రోలింగ్ వాహనాలు.. వేగనిరోధక కెమెరాలు
ఈ రోడ్డుపై గస్తీ నిర్వహించాల్సిన పెట్రోలింగ్ పోలీసు వాహనాలు ఎక్కడా కనిపించడంలేదు. దీంతో వాహనదారులు ఇష్టానుసారంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మరోవైపు వేగాన్ని నిరోధించడం కోసం పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీక్రెట్ కెమెరాలు కూడా సరిగా పనిచేయడంలేదు. దీంతో వాహనదారులు ముఖ్యంగా రాత్రి సమయాల్లో మద్యం తాగి అజాగ్రత్తగా, అతివేగంగా నడుపుతున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడంలేదు.
స్పీడ్ లిమిట్స్ పెంపుతో పెరిగిన ప్రమాదాలు
ఓఆర్ఆర్పై ఇప్పటివరకు గంటకు వంద కిలోమీటర్ల స్పీడుకు మాత్రమే అనుమతి ఉండేది. ఇటీవల వాహనాల స్పీడును 100 నుంచి 120 కి.మీ.లకు పెంచారు. పేరుకు మాత్రమే 120 కి.మీ అయినప్పటికీ 130 నుంచి 140 కి.మీ స్పీడ్‌తో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఆయా వాహనాలకు కేటాయించిన లైన్లలో కాకుండా వేరే లైన్లలో నడిపించడమూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలి
ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదాలను నివారించడం కోసం ఔటర్‌పై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఎగ్జిట్ నంబర్ల వద్ద కూడా ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లేకపోవడంతో వాహనదారులు మద్యం తాగి ఔటర్ పైకి ఎక్కుతున్నారు. తాగిన మైకంలో ఔటర్‌పై మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఔటర్‌పై పెట్రోలింగ్ గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. ఎగ్జిట్ నంబర్ల వద్ద వాహనాల తనిఖీని పెంచాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నెల రోజుల్లో 40 మందికి పైగా మృతి
ఓఆర్ఆర్పై నెల రోజుల వ్యవధిలో 40 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వందమందికి పైగా కాళ్లు చేతులు విరిగి మంచానికి పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఎక్కువగా మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ఆదిబట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున వాహనం మితిమీరిన వేగంతో వెళ్లి ముందుగా వెళుతున్న లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. పొట్టకూటి కోసం వీరంతా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి మొయినాబాద్‌లో నివాసముంటున్నారు. యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వీరి మరణంతో వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. నెలరోజుల వ్యవధిలో పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్, తుక్కుగూడ, బొంగులూరు, ఆదిబట్ల, పెద్ద గోల్కొండ గ్రామాల పరిధిలోని ఓఆర్ఆర్పై పలు ప్రమాదాలు జరిగాయి. ఒక్కో ప్రమాదంలో ముగ్గురు నుంచి ఐదుగురు వరకు మృతిచెందారు. ఓఆర్‌ఆర్‌తోపాటు రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్లలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
పెట్రోలింగ్ గస్తీ ముమ్మరం చేస్తాం
ఓఆర్ఆర్పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పెట్రోలింగ్ గస్తీ పకడ్బందీగా ముమ్మరం చేస్తాం. తృటిలో జరుగుతున్న ప్రమాదాలను కూడా నివారించడానికి స్పీడ్ లిమిట్స్‌తో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటాం. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.
– కేపీవీ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ